కాంగ్రెస్‌కు జగన్ ఎఫెక్ట్: కెసిఆర్ కొత్త రాగం!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొత్త రాగం అందుకున్నారు! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం నుండి స్పష్టమైన ఆదేశాలు రావడం వల్లనే కెసిఆర్ ఈ నయా వాదన అందుకున్నారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనతోనే తమ పోరాటం ఆగిపోదని, రాష్ట్రం వచ్చాక కూడా అభివృద్ధి కోసం తాము పోరాటం చేస్తామని కెసిఆర్ గురువారం కరీంనగర్ జిల్లాలో అన్నారు.

K Chandrasekhar Rao-YS Jagan

తెలంగాణ రాష్ట్ర సాధనే తమ ధ్యేయమని, తెలంగాణ కోసం గొంగలి పురుగును సైతం కౌగిలించుకుంటానని కెసిఆర్ చెబుతుంటారు. అంతేకాదు రాష్ట్రం ఇస్తామంటే తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసేందుకు కూడా కెసిఆర్ సిద్ధమంటారనే ప్రచారం కూడా ఉంది. అయితే ఎప్పుడు తెలంగాణే ధ్యేయమని చెప్పే కెసిఆర్ గురువారం తెలంగాణ వచ్చాక అభివృద్ధి కోసం పోరాడుతామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం కెసిఆర్ గతంలో మాట్లాడలేదని కాదు.

కానీ తెలంగాణ వస్తుందని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని రెండు మూడు రోజుల నుండి కెసిఆర్ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. మూడు రోజులుగా ఆగస్టు లేదా సెప్టెంబరులో తెలంగాణ ఖాయమని చెబుతున్నారు. తెలంగాణ ఖాయమని గట్టిగా చెబుతూనే రాష్ట్రం వచ్చాక అభివృద్ధి కోసమే పోరాడుతామని చెబుతున్నారు. గతంలో కూడా కెసిఆర్ అదిగో తెలంగాణ వస్తుంది... ఇదిగో తెలంగాణ వస్తుందని పలుమార్లు చెప్పారు.

కానీ ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు గతం కంటే భిన్నంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులలో కేంద్రం తెలంగాణపై దీర్ఘంగా ఆలోచిస్తోంది. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో కాంగ్రెసు ఇప్పటికే అక్కడ దాదాపు తుడిచి పెట్టుకు పోయింది. తెలంగాణపై ఓ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోక పోవడం వల్ల, రాష్ట్రంపై మాట ఇచ్చి తప్పడం వల్ల తెలంగాణలో కనుమరుగైంది.

2014లో సీమాంధ్రలో జగన్ ధాటికి కాంగ్రెసు ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలు దాదాపు లేవు. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెసుకు మిగిలింది తెలంగాణ ఒక్కటే. అందుకే తెలంగాణపై ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకునే దిశలో అధిష్టానం యోచస్తుంది. అది తెలంగాణకు అనుకూలంగా ఉండవచ్చుననే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజులలోనే కేంద్రం తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశముందని అంటున్నారు. అలాగైనా తెలంగాణలో పట్టు నిలుపుకోవచ్చునని కాంగ్రెసు భావిస్తోందని అంటున్నారు.

ప్రస్తుతానికి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే కాంగ్రెసు ఆ ప్రాంతంలో ఒక్కసారిగా బలపడుతుంది. ఆ తర్వాత సీమాంధ్రలో క్రమంగా పట్టు పెంచుకోవచ్చునని భావిస్తోందని అంటున్నారు. ఒకవేళ అలా కాకపోయినా జగన్‌ను మచ్చిక చేసుకొని 2014 నాటికి తమ వైపుకు తీసుకు రావచ్చునని భావిస్తోందని అంటున్నారు. అంటే ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ ఇచ్చే అక్కడ బలం పెంచుకోవడమే కాకుండా, ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో రాజకీయావసరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైతే జగన్‌ను తమ వైపుకు తిప్పుకొని సీమాంధ్రలోనూ పట్టు బిగించవచ్చుననేది కాంగ్రెసు వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.

కాంగ్రెసు ఇలా వ్యూహం ప్రకారం వెళుతుంటే.. కెసిఆర్ ఆ ప్రాంతంలో తన పట్టు, ప్రాభవం కోల్పోకుండా ఉండేందుకు అభివృద్ధి మంత్రం ఎత్తుకున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు కెసిఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కెసిఆర్. కాంగ్రెసు తెలంగాణ ప్రకటిస్తే అందులో కెసిఆర్‌కూ క్రెడిట్ ఉంటుందనటంలో సందేహం లేదు. అయితే అది ఆ పార్టీకి అంత బాగా లబ్ధి చేకూర్చక పోవచ్చు. కాంగ్రెసే పుంజుకునే అవకాశముంటుంది.

జగన్, 2014 ఎన్నికలు ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెసు తెలంగాణ ప్రకటించినప్పటికీ ఆ తర్వాత కూడా తన, తన పార్టీ ప్రభావం, పట్టు ఆ ప్రాంతంలో పోకుండా ఉండేందుకే కెసిఆర్ అభివృద్ధి జపం చేస్తున్నారని అంటున్నారు. తెరాస నేతలు కూడా ఇటీవల అభివృద్ధితో పాటు స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తున్నారు.

గత పదేళ్లుగా తెరాస నేతలు ఒక తెలంగాణ నినాదం తప్ప ప్రజల సమస్యల పట్టించుకున్న దాఖలాలు లేవనే అపవాదు ఉంది. అయితే ఇటీవల వారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తాజాగా కెసిఆర్ కూడా అభివృద్ధి నినాదం ఎత్తుకున్నారని, అందుకు కారణం రాష్ట్రం వస్తుందని, వచ్చాక కూడా పార్టీని నిలుపుకోవడానికే అంటున్నారు. అయితే తెలంగాణ ప్రకటిస్తే కెసిఆర్ తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసే అవకాశాలు కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+