బేడీలతో సైకో పరార్: ఎన్‌కౌంటర్ చేయలేదు.. పోలీసులు

ఇతడు ఆరు నెలల్లో వందకు పైగా నేరాలు చేశాడు. ఇంతలా ప్రజలకు వణుకు పుట్టించిన సైకోను పోలీసులు వ్యూహాత్మకంగా బుధవారం కాకాని రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. అయితే అతను చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. అతను చేసిన నేరాల చిట్టాను విప్పేందుకు పోలీసులు గురువారం అతనిని విచారించారు. అయితే కొండపల్లి ఖిల్లా ప్రాంతంలో సొమ్ము దాచానని చెప్పి పోలీసులను అక్కడకు తీసుకు వెళ్లాడని తెలుస్తోంది.
కొండపల్లి ప్రాంతంలో ఓ చోట తాను సొమ్మును దాచానని చెప్పడంతో పోలీసులు అక్కడ సోదాలు ప్రారంభించారు. సైకోను కొండపల్లి కొండల ప్రాంతానికి తీసుకు వెళ్లినప్పుడు అతని చేతిలకు బేడీలు వేశారు. అతని వెంట ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు సిఐలు, పదిమంది కానిస్టేబుల్స్ ఉన్నారు. అయితే ఈ సైకో వారి కళ్లు గప్పి పారిపోయాడు. కొండపల్లి ఖిల్లాలో పోలీసులు సొమ్ము కోసం చూస్తుండగా అతను వారి నుండి తప్పించుకొని పారిపోయాడు.
అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సైకోను వెతకడం కోసం పోలీసులు కొండపల్లి ఖిల్లాను మొత్తం చుట్టుముట్టారు. అరగంట వ్యవధిలోనే అతను పోలీసుల నుండి తప్పించుకున్నాడు. సైకో సాంబశివ రావు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకోవడంపై పట్ల పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతనిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. బేడీలు ఉన్న ఆ వ్యక్తి ఎలా పారిపోగలడనే వాదనలు వినిపిస్తున్నాయి. అది నిర్మానుష్య ప్రాంతంలో ఎలా పోలీసుల కళ్లు గప్పగలడని అంటున్నారు.
అయితే పోలీసులు మాత్రం ఎన్‌కౌంటర్ ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నారు. ఎన్‌కౌంటర్‌కు ఎలాంటి అస్కారం లేదని చెబుతున్నారు. అతని కోసం గాలిస్తున్నామని విజయవాడ, గుంటూరు పోలీసులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్ చేయకుండానే అతనిని పట్టుకుంటామని, చీకటయ్యే వరకు సైకో గురించి గాలిస్తామని చెబుతున్నారు. అతను పోలీసుల కళ్లు కప్పి ఓ పది అడుగుల లోయలోకి దొర్లాడని, అతను బేడీలతో ఉన్నందున ఎక్కువ దూరం వెళ్లి ఉండడని ఖచ్చితంగా పట్టుకుంటామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications