ఏదో చేద్దామని వచ్చా, జగన్ పిలిస్తే చూస్తా: జయసుధ

రాజకీయాల్లో తనకు అసంతృప్తి ఉందని, దీనికంటే సినిమా జీవితమే బాగుందని ఆమె అన్నారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సమయంలో కొందరు మీడియా ప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారా అని ప్రశ్నించారు. అసంకల్పితంగా రాజకీయాల్లోకి వచ్చానని, ఏమీ చేయలేకపోతున్నానని అసంతృప్తితో ఉన్నానని, ఇలాంటి సమయంలో మరో పార్టీకి వెళ్లడం ఎందుకని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో కూడా నిర్ణయించుకోలేదని అన్నారు.
ఏదైనా ఆశ ఉంటే, అక్కడికో ఇక్కడికో పరుగులు పెట్టవచ్చని అంటూ ఎలాంటి లక్ష్యం లేనప్పుడు అటూ ఇటూ చూడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాజకీయాల కన్నా సినిమారంగమే బాగుందని, చాలా బిజీగా ఉన్నానని చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంకోసం ఎంతో కష్టపడ్డానని, అయినా ఎక్కడా ప్రయోజనం లేదని అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దతను తీసుకువస్తున్నారని, దీనిని స్వాగతించదగ్గదని అన్నారు. అయితే, దీని అమలులో చిత్తశుద్ధి ఉండాలని జయసుధ అన్నారు.
ఎవరికి వారే తమ వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకునేందుకు ఆరాటపడితే ఏం లాభమని ప్రశ్నించారు. 2014లో జగన్ ఆహ్వానిస్తే ఆ పార్టీలోకి వెళ్తారా అనే ప్రశ్నకు, ఆయన ఆహ్వానిస్తే అప్పుడు చూద్దామని అన్నారు. 2009లోనూ తాను సికింద్రాబాద్ సీటు ఇవ్వాలని కోరలేదని, ఆ రోజు తాను కోరకుండానే పోటీ చేయాలని ప్రతిపాదించారని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications