తెలంగాణ: రాజీనామా అంటూ అధిష్టానానికి అల్టిమేటం

ఇక తెలంగాణ ప్రాంత నేతలు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని లేదంటే కాంగ్రెసు పార్టీకి తెలంగాణ ప్రాంతంలో నూకలు చెల్లినట్లేనని, అదే జరిగితే తాము ప్రత్యామ్నాయం చూసుకోక తప్పదని పలుమార్లు హెచ్చరించారు. అఖిల పక్ష సమావేశం తర్వాత కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నెల రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరు ప్రాంతాల నేతలు అధిష్టానంపై మరింత ఒత్తిడి తీసుకు వస్తున్నారట.
తమకు అనుకూలంగా లేకుంటే మళ్లీ రాజీనామాల పర్వానికి తెరతీస్తామని ఇరు ప్రాంతాల నేతలు స్పష్టం చేస్తున్నారట. ఏ నిర్ణయం వచ్చినా మరో పక్షం ప్రత్యక్ష కార్యాచరణకు సన్నద్ధమయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇది ఎటు నుంచి ఎటు దారి తీస్తుందోనన్న ఆందోళన పార్టీ నేతల్లో కన్పిస్తోంది. ఇప్పటి వరకూ అధిష్ఠానం ఆలోచన స్పష్టం కాకపోయినా ఎవరికి వారే ఆశ, నిరాశల్లో ఊగిసలాడుతున్నారు.
ఇటీవల కొందరు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు అధిష్ఠానం పెద్దలతో సమావేశమయ్యారు. 28న ఏం నిర్ణయం చెప్పనున్నారో తమకు తెలపాలని వారు ఢిల్లీ పెద్దలను కోరారట. అయితే అధిష్టాం నుండి వారికి దిమ్మతిరిగే సమాధానం వచ్చిందట! దీంతో సీమాంధ్ర నేతలు ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారట. అయితే అదేం లేదని తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ఏమీ రాదని మరికొందరు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివ రావు, అనంత వెంకట్రామి రెడ్డి తదితరులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొందరు తెలంగాణ ప్రజా ప్రతినిధులు కూడా అధిష్ఠానం పెద్దలతో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు హైదరాబాద్ ప్రస్తావన వచ్చిందట. తాము హైదరాబాదుతో కూడి తెలంగాణ తప్ప వేరే దానిని ఒప్పుకునే పరిస్థితి లేదని వారు చెప్పారట. తమకు అనుకూలంగా లేకుంటే ఇరు ప్రాంతాల నేతలు రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారట.












Click it and Unblock the Notifications