కిరణ్ రెడ్డి, చంద్రబాబులపై దుమ్మెత్తిపోసిన షర్మిల

కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయిందని ఆమె ఆరోపించారు. చంద్రబాబుపై కాంగ్రెసు ప్రభుత్వం కేసులు పెట్టదని, ప్రతిగా చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబోరని ఆమె అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని చంద్రబాబు నెత్తిన మోస్తూ కాపాడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆయన అన్నారు.
చంద్రబాబు పాలనలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె అన్నారు. వైయస్ జగన్ బయటకు వస్తే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మూతపడతాయని ఆమె అన్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి కూతురు నివాసంలో డబ్బులు దొరికాయని ఆమె గుర్తు చేశారు. వైయస్ జగన్ బయటకు రాకుండా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆమె విమర్శించారు.
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంట్ సంక్షోభం తలెత్తిందని, కరెంట్ చార్జీలు పెంచారని, గ్యాస్ ధరలు పెంచారని ఆమె అన్నారు. కరెంట్ కొరతతో పరిశ్రమలు మూత పడుతున్నాయని, దాంతో లక్షల మంది యువకులు ఉపాధి కోల్పోయారని ఆమె అన్నారు. అన్ని విషయాల్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 8 సార్లు కరెంట్ చార్జీలు పెంచారని ఆమె అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులకు సహకారం అందడం లేదని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆమె వివరించారు. ఆ పథకాలు నీరుగారిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications