'చిలుక'కు స్వేచ్ఛ!: సిబిఐకి స్వయం ప్రతిపత్తికి ఓకే

సీబీఐకి స్వయంప్రతిపత్తి కల్పించాలనే సిఫారసుపై కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. సిబిఐ చేపట్టిన కేసుల్లో దర్యాప్తు సాగుతున్న తీరును రిటైర్డ్ న్యాయమూర్తులతో కూడిన బృందం పర్యవేక్షించాలన్న సిఫారసును ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం నేతృత్వంలోని మంత్రుల బృందం చేసిన సిఫారసులను గురువారం కేంద్ర కేబినెట్ పరిశీలించింది.
సమాచారం ప్రకారం.. సిబిఐ డైరెక్టర్ నియామకం ఏకపక్షంగా జరగకూడదని, ప్రధాని, లోక్‌సభలో విపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కొలీజియం సిబిఐ డైరెక్టర్‌ను ఎంపిక చేయాలని మంత్రుల బృందం పేర్కొంది. సిబిఐ డైరెక్టర్ ఆర్థిక అధికారాలను కూడా పెంచాలని సూచించింది.
సిబిఐలోని ప్రాసిక్యూషన్స్ విభాగం డైరెక్టర్‌ను ఇప్పుడు న్యాయమంత్రిత్వ శాఖ నియమిస్తోంది. ఈ పద్ధతి కూడా మార్చాలని పేర్కొంది. సిబిఐకి స్వయం ప్రతిపత్తి అంశంపై వచ్చేనెల 10 సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసే అఫిడవిట్‌లో మంత్రుల బృందం సిఫారసులను కూడా చేర్చనున్నారు.
ఈ బృందంలో చిదంబరంతోపాటు న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి నారాయణ స్వామి ఉన్నారు. వీరు సోమవారం తమ నివేదికను రూపొందించారు.












Click it and Unblock the Notifications