కొట్టుకుపోయిన బస్సు, ప్రమాదస్థాయిలో హుస్సేన్‌సాగర్
హైదరాబాద్: భారీగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయి. అదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీగలపల్లి వాగులో ఓ ఆర్టీసి బస్సు కొట్టుకుపోయింది. అదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో ఇది జరిగంది. కొద్ది దూరం వెళ్లిన బస్సు బోల్తా పడింది. కండక్టర్, డ్రైవర్‌ల ఆర్తనాదాలు విన్న స్థానికులు వారిని కాపాడారు. దాదాపు గంటసేపు వారు బస్సు పైనే ఉన్నారు. కరీంనగర్ జిల్లాలోని మహదేవ్‌పూర్ మండలంలోని మోడేడు గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది.
భారీ వర్షాల కారణంగా ఖమ్మం, వరంగల్, అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని వాగులు పొంగుతున్నాయి. కరీంనగర్ జిల్లా కాలేశ్వరం వద్ద రెండు పోలీసు బృందాలు కూంబింగ్ కోసం వెళ్లి నీటిలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగులు దాటింది. దవళేశ్వరం వద్ద పది అడుగులకు చేరింది.

అదిలాబాద్ జిల్లాలోని పెన్‌గంగా, ఎర్రవాగు, ఖమ్మం జిల్లాలోని తాలిపేరు, వరంగల్ జిల్లాలోని జీడివాగు, జంపన్నవాగు, కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టు నుండి లక్షా ముప్పైవేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పలు జిల్లాల్లో గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. వీధులు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది.
కృష్ణా పరివాహక ప్రాంతంలోని జలకళ కనిపిస్తోంది. అలమట్టి, నారాయణపూర్ డ్యాంలలో నీరు నిండింది. పలుచోట్ల ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఖమ్మం జిల్లా చల్ల మండలం వీరాపురంలో గోదావరిలో పలువురు చిక్కుకున్నారు. వారిని రెవెన్యూ అధికారులు రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. వరదల కారణంగా చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. రామగుండం రీజియన్లో ఓపెన్ కాస్టుల్లో వరద నీరు చేరడం వల్ల ఉత్పత్తి నిలిచిపోయింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. జంట నగరాల్లోని పలు ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి కలుస్తుండటంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో సాగర్ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications