వర్షాలు: జలదిగ్బంధంలో గ్రామాలు, ఎన్నికలు వాయిదా
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. భద్రాచలం వద్ద శనివారం కాస్త తగ్గుముఖం పట్టిన గోదావరి మళ్లీ ఆదివారం కొద్దిగా పెరిగింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటి మట్టం 56 అడుగులుగా ఉంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో చాలా గ్రామాలు ముంపు భారిన పడ్డాయి. చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వద్ద గోదావరి పొంగి పొర్లుతోంది. దవళేశ్వరం వద్ద నీటి మట్టం 16.70 అడుగులకు చేరింది. దీంతో 17,74,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. లంక గ్రామాలు నీట మునిగాయి. వేలాది ఎకరాల పంట నీట మునిగింది.

ముఖ్యమంత్రి సమీక్ష
రాష్ట్రంలో వరద బాధిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాలకు సహాయ బృందాలను పంపించి, వరద బాధితులకు ఆహార పొట్లాలను అందించాలని ఆదేశించారు.
ఎన్నికలు వాయిదా
భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, ములుగు మండలాల్లోని నాలుగు పంచాయతీలకు ఎన్నికలు వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. ఏటూరు నాగారం మండలంలోని చేల్పాక, కొండాయి, ఐలాపూర్, ములుగు మండలంలోని సర్వాపూర్ పంచాయతీలకు ఎన్నికలు వాయిదా వేసినట్లు చెప్పారు. మూడో విడతలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా ఇతర జిల్లాల్లోను పలు ప్రాంతాల్లో కూడా ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications