మేం రాయలసీమలో కలవడమేంటి?: టిజిపై డికె అరుణ

రాయలసీమ ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న టిజి రాయల తెలంగాణపై ఆ ప్రాంత ప్రజల మనోభావాల గురించి మాట్లాడాలే గానీ, తెలంగాణలో అంతర్భాగమైన గద్వాల, ఆలంపూర్ ప్రజల మనోభావాల గురించి మాట్లాడడం సరికాదన్నారు. రాష్ట్ర మంత్రిగా గద్వాల నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తాను టిజి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
రాయలసీమతో నడిగడ్డకు వ్యాపారపరంగా, బంధుత్వాలపరంగా ప్రాధాన్యం ఉందని, ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేలా తన సొంత అభిప్రాయాలను రుద్దడానికి ప్రయత్నించడం సరికాదని హితవు పలికారు. తెలంగాణలోని ప్రాంతాలను రాయలసీమ రాష్ట్రంలో కలపాలని ఆయన చెప్పడం ఏమాత్రం సరికాదన్నారు.
కాగా, అందరూ ఒప్పుకొంటే విభజనను ఆపలేమని రాష్ట్ర టిజి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పార్టీలే రాజులని.. అవి తలచుకుంటే ఏం చేయగలవన్నారు. చంద్రబాబు, విజయమ్మ, నారాయణ అంతా తెలంగాణ కావాలని కోరుతున్నారని, ఇంతకాలం ఒప్పుకోని కాంగ్రెస్ కూడా ఇప్పుడు తెలంగాణ ఇస్తుందన్న భావన కలుగుతోందన్నారు. ఎన్నికలకు ముందుగానే అధిష్ఠానం తెలంగాణ సమస్యకు ఫుల్‌స్టాప్ పెడుతుందని అనేక సందర్భాల్లో చెప్పానని, ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందన్నారు.
విభజన అనివార్యమైతే.. మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్, గద్వాల నియోజకవర్గాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయల తెలంగాణను జీర్ణించుకోలోకపోతున్నామని, కుటుంబాన్ని, భార్యాభర్తలను విడదీసినట్లు భావిస్తున్నామన్నారు. అలంపూర్, గద్వాలలను రాయలసీమలో కలపాలనడం పట్ల డికె అరుణ అభ్యంతరం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications