విభజనపై నో: చంద్రబాబుతో అఖిలేష్ 'మూడో' ముచ్చట
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ పర్యటన బిజీబిజీగా సాగింది. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న అఖిలేష్ పలువురు రాష్ట్ర నేతలను కలుసుకున్నారు. అఖిలేష్ తన పర్యటనలో థర్డ్ ఫ్రంట్, విభజన వంటి అంశాలపై వ్యూహాత్మక మౌనం పాటించారు.
అఖిల భారత యాదవ మహాసభ కోసం వచ్చిన అఖిలేష్ ప్రధానంగా థర్డ్ ఫ్రంట్ పైన ఆచితూచి స్పందించారు. థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడేందుకు ఇది రాజకీయ వేదిక కాదని, భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడే చెప్పలేమని, కాలక్రమంలో జరగాల్సినవి జరిగిపోతాయన్నారు. రాష్ట్రానికి చెందిన పలువురు ముఖ్య నేతలు, యాదవ నేతలను కలుసుకున్న అఖిలేష్.. రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. పలువురితో తెలంగాణ అంశం కూడా చర్చించారని అంటున్నారు.

థర్డ్ ఫ్రంట్‌లాగే విభజన పైన కూడా మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. చిన్న రాష్ట్రాలపై స్పందించేందుకు ఇది సరైన సమయం కాదని చెప్పారు. సమాజ్‌వాది పార్టీ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం. శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయిన సమయంలో విభజన అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
చిన్న రాష్ట్రాలకు తాము వ్యతిరేకమని, తమ రాష్ట్రం నుండి విడిపోయిన ఉత్తరాఖండ్‌లో ఇప్పటికీ సరైన అధికార యంత్రాంగం లేదని, ఇటీవల వరదలొస్తే కనీస స్థాయిలో సహాయక చర్యలు తీసుకోలేకపోయారని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. యుపిని నాలుగు రాష్ట్రాలుగా చేయాలని బిఎస్పీ అధినేత్రి మాయావతి తీర్మానం చేస్తే.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తాము భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చామని చెప్పారట.
శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులను కలుసుకున్న అఖిలేష్.. ఆదివారం మంత్రి రఘువీరా రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, టిడిపి సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరుల ఇళ్లకు వెళ్లారు.
బాబుతో 'మూడో' ముచ్చట
నిన్న రాత్రి చంద్రబాబుతో అరగంట పాటు భేటీ అయిన అఖిలేష్ యాదవ్ మూడో ఫ్రంట్ సాధ్యాసాధ్యాల పైన చర్చించినట్లుగా తెలుస్తోంది. బాబుతో భేటీ అనంతరం అఖిలేష్.. తాను బాబుతో థర్డ్ ఫ్రంట్ విషయమై చర్చించినట్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. బిసిలకు వంద టిక్కెట్స్ ఇస్తామని చెప్పడాన్ని అఖిలేష్ స్వాగతించారు. తాను యూపిలో దీనిని అమలు చేశామని చెప్పారు.
అఖిలేష్ కాన్వాయ్‌పై దాడి చేసిన వారి గుర్తింపు
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కాన్వాయ్పైన దాడి చేసిన వారిని గుర్తించి, కేసు నమోదు చేసినట్లు పశ్చిమ మండల డిసిపి సత్యనారాయణ ఆదివారం చెప్పారు. కాన్వాయ్ పైన దాడి చేసిన నలుగురు నిందితులను గుర్తించామన్నారు. వారుపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
నిందితులు చీఫ్ సెక్యూరిటీ పైన కూడా దాడి చేశారని, సిసి టివి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు చెప్పారు. పార్లమెంటు సభ్యుడి అనుచరులే ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నామని, అయితే విచారణ అనంతరం ఎవరనేది తేల్చుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications