కేంద్ర మంత్రుల రాజీనామా: చిరు, కావూరి దూరం

కాగా, రాష్ట్ర విభజనపై అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా పదవులను వదులుకోవాలని నలుగురు కేంద్ర మంత్రులు, ఏడుగురు ఎంపీలు నిర్ణయించారు. శుక్రవారం ఉదయం వారు పత్రాలు సమర్పించనున్నారు. రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు నివాసంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట దాకా సాగిన ఈ సమావేశంలో నలుగురు కేంద్ర మంత్రులు పళ్లంరాజు, దగ్గుబాటి పురందేశ్వరి, జెడి శీలం, కిల్లి కృపారాణి, ఏడుగురు పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, హర్షకుమార్, సాయి ప్రతాప్, కెవిపి రామచంద్ర రావు పాల్గొన్నారు.
మరో ముగ్గురు పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎస్పీవై రెడ్డి కూడా రాజీనామాలకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సమావేశంలో పాల్గొన్న వారు ఫోన్‌లో మాట్లాడినప్పుడు వారు తమ ఆమోదం తెలియజేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో సమావేశమై, ఎంపీలంతా అక్కడికక్కడే స్పీకర్ మీరాకుమార్‌కు పత్రాలు సమర్పించాలని నిర్ణయించారు.
కేంద్ర మంత్రులు మాత్రం మేడమ్ సోనియాకు, ప్రధాని మన్మోహన్‌కు చివరిసారిగా రాష్ట్ర విభజనకు తమ వ్యతిరేకత తెలియజేసి, పత్రాలు సమర్పించాలని నిశ్చయించారు. సీమాంధ్ర లోక్‌సభ సభ్యులు మొత్తం 18 మందికి (సబ్బం హరి మినహా) గాను తొమ్మిది మంది, రాజ్యసభ సభ్యులు ఆరుగురికిగాను ఇద్దరే కెవిపి భేటీకి హాజరయ్యారు. సగానికిపైగా ఎంపిలు ఈ భేటీకి డుమ్మా కొట్టారు.
కేవీపీ ఇంట్లో జరిగిన సమావేశం ప్రధానంగా రెండు విషయాలపై దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణ ఏర్పాటును నిలువరించడం, సీమాంధ్రకు న్యాయం చేయడం అనే రెండు అంశాలపైనే దృష్టి కేంద్రీకరించింది. రాజీనామాలపై ఇందులో తర్జనభర్జన జరిగింది. నేతల్లో స్పష్టమైన విభజన కనిపించింది. రాజీనామాలకు కొందరు విముఖత వ్యక్తంచేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో వచ్చినప్పుడు వ్యతిరేకించడానికి ఎంపిలుగా కొనసాగాల్సిన అవసరం ఉందని కొందరన్నారు.












Click it and Unblock the Notifications