హెల్మెట్స్ ధరించి వెంబడించి దాడి చేశారు: అశోక్ బాబు
హైదరాబాద్: హెల్మెట్లు ధరించి మోటారు సైకిళ్లపై వెంబడించి సీమాంధ్ర బస్సుల పైన దాడికి పాల్పడ్డారని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మంగళవారం అన్నారు. 7వ తేదిన తాము నిర్వహించిన సభ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, తిరిగి వెళ్తున్న సమయంలో సీమాంధ్ర ఉద్యోగులపై పథకం ప్రకారమే దాడి చేశారన్నారు. పోలీసు ఎస్కార్టు ఉన్నప్పటికీ దాడులు జరిగాయన్నారు.
ఈ దాడులలో నాలుగు బస్సులు ధ్వంసమయ్యాయని, 5 బస్సుల అద్దాలు పగిలిపోయాయని చెప్పారు. ఈ నెల 16వ తేది నుండి సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలను కలిసి సమైక్యం కోసం పోరాడాలని కోరుతామన్నారు. దాడి ఘటనపై డిజిపి దినేష్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దాడులతో సమస్య పరిష్కారం కాదని, ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎప్పుడు సవ్యంగా మాట్లాడరని, ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సమైక్యవాదులే దాడులు చేశారని కొందరు రాజకీయ నాయకులు అనడం సరికాదన్నారు. కేబినెట్ నోట్ అసెంబ్లీకి రావాల్సిందేనని, దానిపై ఆలోచిస్తామన్నారు. ఇవాల్టి నుండి 12 వరకు సీమాంధ్రలో జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు అవగాహన సదస్సులు పెడతామన్నారు.
సచివాలయంలో టిఎన్జీవోల నిరసన
సచివాలయంలోని సమత బ్లాకు ముందు టిఎన్జీవోలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయంలోకి వెళ్తున్న వారిని పోలీసులు తనిఖీ చేస్తుండగా వివాదం చోటు చేసుకుంది. సచివాలయం భద్రతా సిబ్బందికి, టిఎన్జీవోలకు మధ్య చిన్నగా ప్రారంభమైన వాగ్వాదం జరిగింది. దీంతో సమత బ్లాకు ముందు టిఎన్జీవోలు బైఠాయించి పోలీసుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications