షర్మిల బస్సు యాత్రలో తొక్కిసలాట: ఓ వ్యక్తి మృతి
ఒంగోలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్రలో మంగళవారం సాయంత్రం అపశృతి చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని దోర్నాల బస్సు స్టాండు వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో కాకుమాను కృష్ణమూర్తి అనే 60 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు విడిచాడు.
కాగా, తన ప్రసంగంలో షర్మిల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. ప్రజారాజ్యం పార్టీని అమ్మేసుకున్న చిరంజీవికి, కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయిన చంద్రబాబు మధ్య తేడా లేదని ఆమె అన్నారు. చంద్రబాబు మద్దతు వల్లనే రాష్ట్రంలో మైనారిటీ ప్ఱభుత్వం అధికారంలో కొనసాగుతోందని ఆమె విమర్శించారు. గత నాలుగేళ్లలో ప్రతి విషయంలోనూ కాంగ్రెసు పార్టీతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయిందని ఆమె అన్నారు.

సిగ్గు లేకుండా ప్రతి ఎన్నికలోనూ చంద్రబాబు కాంగ్రెసుతో కలిసి పనిచేశారని ఆమె అన్నారు. బ్లాంక్ చెక్ ఇచ్చినట్లుగా చంద్రబాబు రాష్ట్ర విభజనకు లేఖను రాసిచ్చారని, విభజనకు చంద్రబాబు మద్దతు ఇవ్వడం వల్లనే రాష్ట్రంలో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొందని షర్మిల అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఎందుకు ఇచ్చావని చంద్రబాబును ప్రజలు నిలదీయాలని అన్నారు.
తమ పార్టీతో పాటు మజ్లీస్, సిపిఎం రాష్ట్ర విభజనకు ఎప్పుడూ అంగీకరించలేదని ఆమె అన్నారు. ఎగువ రాష్ట్రాల ఇప్పటికే మన రాష్ట్రానికి నీరు రావడం తగ్గిందని, కృష్ణా నదీ జలాలు రాకపోతే సీమాంధ్ర అంతా ఎడారి అవుతుదని అన్నారు. కృష్ణానదిలో నీళ్లు లేకుంటే ఎలా, దీనికి కాంగ్రెసు నేతలు సమాధానం చెప్పాలని ఆమె అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తానని కేంద్రం చెబుతోందని, మధ్యలో మరో రాష్ట్ర వస్తే పరిస్తితి ఏమిటని అన్నారు
గతంలో మద్రాసును తీసుకున్నారని, ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా తీసుకుంటామని అంటున్నారని, చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని, వారిపైన ఆధారపడిన తల్లిదండ్రులు ఏం చేయాలని ఆమె అన్నారు. హైదరాబాదును కట్టుకోవడానికి యాభై ఏళ్లు పట్టిందని, పదేళ్లలో హైదరాబాద్ లాంటి రాజధానిని ఎలా కట్టుకోవాలని ఆమె అన్నారు.
జగనన్న దోషి అని ఏ కోర్టు కూడా చెప్పలేదని, చంద్రబాబు నిర్దోషి అని ఏ కోర్టు కూడా చెప్పలేదని షర్మిల అన్నారు. చిరంజీవి వియ్యంకుడి ఇంట్లో కోట్ల రూపాయల డబ్బు దొరికినా ఏ కోర్టు కూడా నిర్దోషి అని చెప్పలేదని ఆమె అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం మన కర్మ అని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications