పవన్ కళ్యాణ్: పిల్లల ప్రాణాలతో చెలగాటమా?: పొరుగు రాష్ట్రాలను ప్రస్తావిస్తూ జగన్ సర్కారుకు హితవు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుకు హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం సన్నద్ధం కావడం తల్లిదండ్రులలో కలవరం కలిగిస్తోందన్నారు.

చిన్నారుల ప్రాణాలతో చెలగాటమా?
జులై 10 వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. పరీక్షా పేపర్లు కుదించినప్పటికీ కోవిడ్-19 రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో చిన్నారుల ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టి ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంత మాత్రం మంచిది కాదన్నారు పవన్ కళ్యాణ్.

పొరుగు రాష్ట్రాలను చూసైనా..
ఏపీకి పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎక్కడా పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. డిగ్రీ, పీజీ, ఉన్నతమైన వృత్తి సంబంధిత పరీక్షలతో పాటు, ప్రవేశ, ఉద్యోగ పరీక్షలు సైతం రద్దయిపోయాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి కరోనాని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర హైకోర్టు ఎంతమాత్రమూ అంగీకరించలేదు. పిల్లల ప్రాణాలను పణంగా పెట్టడానికి మేము ఎటువంటి పరిస్థితులలో అంగీకరించమని హైకోర్టు ఖరాకండిగా తెలిపింది. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నల్ మార్కులు ఆధారంగా ఉత్తీర్ణతను ఖరారు చేసిందని జనసేనాని తెలిపారు. .

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలి: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. 6 వేలకు పైగా కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. పరీక్షా కేంద్రాలకు పిల్లలను తీసుకు వెళ్లడం చాలా ప్రమాదకరంగా కనబడుతోంది. ప్రైవేట్ వాహనాలు అందుబాటు కూడా చాల తక్కువగా వుంది. ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో తల్లిదండ్రుల కోరిక, చిన్నారుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి పరీక్షలు రద్దు చేసి, పొరుగు రాష్ట్రాలలో అనుసరించిన విధానాలను పాటించవలసిందిగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు.

జగన్ సర్కారు సరైన నిర్ణయం తీసుకోవాలి..
విద్యావంతులు, వైద్య నిపుణులతో పలు దఫాలు చర్చించిన తరవాతే ఇటువంటి డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాము. ప్రభుత్వం విజ్ఞతతో పిల్లల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు 6456 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 86 మంది చనిపోయారు.












Click it and Unblock the Notifications