ఏపీలో స్థిరంగా కొత్త కరోనా కేసులు, తగ్గిన మరణాలు: 25వేలకు యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవువుతున్న కరోనావైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా 3వేలకు దిగవనే కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య తక్కువగానే ఉంటోంది. అయితే, కరోనా టెస్టుల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 90,204 నమూనాలను పరీక్షించగా.. 2591 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 2591 కరోనా కేసులు, 15 మంది మృతి
తాజాగా నమోదైన 2591 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,29,579కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 15 మంది మృతి చెందారు.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు మరణించగా, ప్రకాశంలో ముగ్గురు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,057 మృతి చెందారు.

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 25వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 3,329 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 18,90,565కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 25,957 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,32,20,912 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 511 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలులో 29 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులివే
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 69, చిత్తూరులో 349, తూర్పుగోదావరిలో 511, గుంటూరులో 219, కడపలో 217, కృష్ణాలో 190, కర్నూలులో 29, నెల్లూరులో 162, ప్రకాశంలో 251, శ్రీకాకుళంలో 62, విశాఖపట్నంలో 220, విజయనగరంలో 46, పశ్చిమగోదావరిలో 266 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,71,149, చిత్తూరులో 2,25,491 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. కాగా, ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(80,953) కరోనా కేసులున్నాయి.












Click it and Unblock the Notifications