కెసిఆర్ జిల్లాలో: సున్నా మార్కులు, 24 మంది టీచర్లపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సొంత జిల్లా మెదక్‌లో 24 మంది ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. ఐదు పాఠశాలల్లో ఎస్ఎస్‌సీ ఇంటర్నల్ అసెస్‌మెంటులో సున్నా మార్కులు ఇచ్చినందుకు గాను ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది.
విధులు సరిగా నిర్వహించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారనే ఆరోపణపై తెలంగాణ ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. ఏడాదంతా విద్యార్తుల తెలివితేటలను అంచనా వేయకుండా వారికి సున్నా మార్కులు ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహించింది. ఐదు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మెమోలు జారీ అయ్యాయి.
పరీక్షలు రాయడానికి కనీసం 70 శాతం హాజరు ఉండాలనే ప్రభుత్వ నియమం వల్లనే విద్యార్థులకు సున్నా మార్కులు ఇవ్వాల్సి వచ్చిందని, వారు బడికి సరిగా రాలేదని ని టీచర్లు వాదిస్తున్నారు.
టీచర్లపై ఇంత కఠినమైన చర్యలు తీసుకోవడం బహుశా ఇదే మొదటిసారి. తాజా పరిణామంతో 1.5 లక్షల మంది గల టీచర్ల కమ్యూనిటీ ఒక్కసారిగా చలించింది. సస్పెన్షన్లను నిలిపేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.

తొలిసారి రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయించారు. రాత పరీక్షలో 80కి 80 శాతం మార్కులు పొందినప్పటికీ ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో కనీసం 7 మార్కులైనా సాధించకపోతే విద్యార్థులు ఫెయిలైనట్లే.
బడికి హాజరు, ఎక్స్‌ట్రా కరికులర్ యాక్టివిటీ, క్రమశిక్షణ తదితర అంశాలపై ఆధారపడి విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు ఇస్తారు. ఐదు పాఠశాలల విద్యార్థులకు జీరో మార్కులు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్ఎస్‌సీ ఫలితాలు మే 11వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను ఉపాధ్యాయులు ఎస్ఎస్‌సి బోర్డుకు పంపించాల్సి ఉంటుంది. ఆ మార్కులను బోర్డు అధికారులు తుది మార్కుల్లో జత చేస్తారు.
ఆ సంఘటనపై ఎస్ఎస్‌సి బోర్డు విచారణకు ఆదేశించి, తిరిగి ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు పంపించాలని ఆదేశించింది. ప్రైవేట్ పాఠశాలలు 20కి 20 ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు ఇస్తుంటే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఈ విధమైన చర్యకు దిగడం కూడా విమర్శకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications