జగన్‌పై కేసు నమోదు: పార్టీ నాయకులతో కసరత్తు
హైదరాబాద్/గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై గుంటూరు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియామావళిని అతిక్రమించి ఫ్లెక్సీలు, బ్యానర్‌లు ఏర్పాటు చేశారని మున్సిపల్ కమిషనర్ వీరభద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఒకటో పట్టణ సిఐ సుబ్బారావు తెలిపారు.
మున్సిపల్ డివైడర్లు, రహదారులపై నిబంధనలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఎంపి అభ్యర్థి అయోధ్య రామిరెడ్డి, ఉత్తమరెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు సిఐ సుబ్బారావు చెప్పారు.

ఎన్నికల వ్యూహంపై జగన్ కసరత్తు
హైదరాబాద్: సార్వత్రికి ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసం లోటస్‌పాండ్‌లో శనివారం ఉదయం పార్టీ జిల్లా అధ్యక్షులతో భేటీ అయిన జగన్, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేశారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున గుంటూరు జిల్లాలో పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. గుంటూరు జిల్లాలోని మాచర్లలో శనివారం రెండో రోజు ఓదార్పు యాత్ర ముగించుకున్న తర్వాత ఆదివారం నల్గొండ జిల్లా యాత్ర చేయాల్సి ఉంది. అయితే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో చర్చించనున్న నేపథ్యంలో నల్గొండ జిల్లా పర్యటనను ఆయన వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా ఏ తేదీల్లో నల్గొండ జిల్లాలో వైయస్ జగన్ పర్యటించేది తరువాత ప్రకటిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. శనివారం మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికీ వెలువడటం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన కూడా వెలువడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతో అత్యవసరంగా భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications