తిరుమల ఘాట్ రోడ్ లో ఒంటరిగా వెళ్లొద్దని సూచించిన టీటీడీ
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 74,510 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,050 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.98 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 11 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

మొన్నటివరకు తిరుమలలో చిరుతల సంచారం నెలకొంది. తిరుపతి- తిరుమల మెట్ల మార్గంలో పలుమార్లు చిరుతలు కనిపించాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో తిరుమలకు వెళ్లే భక్తులను భయాందోళనలకు గురి చేశాయి. గతంలో సీఆర్ఓ కార్యాలయం సమీపంలోనూ చిరుతలు తిరుగాడిన సందర్భాలు ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా ఏనుగులు.. సంచరిస్తోన్నాయి. ఏనుగుల గుంపు తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో హల్ చల్ చేసింది. గురువారం రాత్రి తిరుమలకు వెళ్తోన్న భక్తులు ఈ ఏనుగుల గుంపును గుర్తించారు. మొత్తం నాలుగు ఏనుగులు ఘాట్ రోడ్డు పక్కనే సంచరించడం కనిపించింది.
దీంతో భక్తులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ గుంపులో ఓ ఏనుగు ఘాట్ రోడ్డు మీదికి రావడానికి ప్రయత్నించడం ఈ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వాటి కదలికలను చిత్రీకరిస్తోన్న భక్తులు గట్టిగా కేకలు వేయడం, వాహనాల హెడ్ లైట్ల వెలుగును ప్రసరించజేయడంతో అవి వెనక్కి తగ్గాయి.
సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ అటవీ విభాగం సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏనుగులను అడవిలోకి మళ్లించారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులు ఒంటరిగా కొండపైకి వెళ్లొద్దని, గుంపులుగా వెళ్లాలని కోరారు. భక్తుల భద్రత కోసం టీటీడీ అటవీ విభాగం సిబ్బంది పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications