ప్రవర్తన నచ్చక అక్కను నరికేశాడు: భార్యపై అనుమానంతో..
కరీంనగర్/మెదక్: తోడబుట్టిన అక్క ప్రవర్తన నచ్చక ఓ తమ్ముడు ఆమెను నరికిచంపాడు. ప్రవర్తన మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని మహాముత్తారంలో చోటు చేసుకుంది.
కాటారం సిఐ తులా శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారానికి చెందిన జాడి మల్లమ్మకు కూతురు లక్ష్మి(22), కొడుకు రాజబాపు ఉన్నారు. కొన్నేండ్ల కిందట భర్త మృతిచెందాడు. లక్ష్మి రెండేండ్ల కిందట హైదరాబాద్‌లో ప్రైవేట్ హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేసింది. అక్కడే వరంగల్‌లోని శివనగర్‌కు చెందిన శివకుమార్ పరిచయమయ్యాడు.
నెల కిందట అతడిని మహాముత్తారంలోని ఇంటికి తీసుకొచ్చింది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. గతంలోనూ ఇలాగే ఓ వ్యక్తిని తీసుకొచ్చి సహజీవనం చేసింది. ప్రవర్తన మార్చుకోవాలని ఆమెను తమ్ముడు రాజబాపు చాలా సార్లు హెచ్చరించినా ఆమె మారలేదు. గురువారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రాజబాపు గొడ్డలితో లక్ష్మి మెడపై నాలుగుసార్లు నరకడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ప్రవర్తన మార్చుకోకపోవడంతోనే ఘాతుకానికి పాల్పడినట్లు రాజబాపు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. నిందితుడు రాజబాపు, సహజీవనం చేసిన శివకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భార్యపై అనుమానంతో బిడ్డను చంపేశాడు
మెదక్: భార్యపై ఉన్న అనుమానంతో అభంశుభం తెలియని చిన్నారి తండ్రి చేతిలో బైలంది. ఈ దారుణం మెదక్ జిల్లా న్యాల్‌కల్ మండలం డప్పూర్‌లో చోటు చేసుకుంది. జహీరాబాద్ రూరల్ సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని బేమాల్‌ఖేడ్ గ్రామానికి చెందిన దశరథ్ హైదరాబాద్‌లో కూలి పనులు చేస్తున్నాడు.
పెద్దమ్మ ఉంటున్న డప్పూర్‌కు అప్పుడప్పుడూ వచ్చేవాడు. అ సమయంలోనే పక్కింట్లో ఉండే స్రవంతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ శారీరకంగా ఒక్కటవడంతో స్రవంతి గర్భం దాల్చింది. గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించడంతో వివాహాం చేసుకుంటానని ఒప్పుకున్నాడు. తర్వాత పెండ్లి చేసుకుని హైదరాబాద్ వెళ్లిపోయాడు. నెలలు నిండుతుండడంతో స్రవంతి ఇంటివద్దే ఉన్నది. స్రవంతి తన వల్లే గర్భం దాల్చిందని దశరథ్‌కు నమ్మకం లేదు.
అప్పటి నుంచి ఆమెను అనుమానించేవాడు. ఐదునెలల కిందట స్రవంతి ఆడపిల్లకు జన్మనిచ్చింది. బుధవారం డప్పూర్‌కు వచ్చిన దశరథ్ గురువారం ఉదయం సిగరెట్లు తెమ్మని భార్యను బయటికి పంపాడు. వచ్చేలోగా చిన్నారిని ఊపిరాకుండా చేసి గొంతునులిమి హతమార్చాడు.
ఆ తర్వాత తనకేమీ ఎరగనట్టుగా ప్రవర్తించాడు. కుటుంబసభ్యులు మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదుచేశారు. కూతురు తనవల్లే పుట్టిందని నమ్మకం లేకపోవడంతోనే హతమార్చానని దశరథ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications