వాగులో చిక్కుకున్న యువకుడు: కాపాడాలని వేడుకుంటున్న బంధువులు
కృష్ణా: పొలం పనులు చూసుకుని వస్తూ ఓ యువకుడు వాగులో చిక్కుకుపోయాడు. ఈ ఘటన పెనుగంచిప్రోలు మండలం శెనగపాడు వద్ద చోటుచేసుకుంది. యేసునాథ్ అనే యువకుడు పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తూ మున్నేరువాగులో చిక్కుకుపోయాడు.
యేసునాథ్ ఉన్న ప్రాంతాన్ని వరద ముంచే అవకాశం ఉండడంతో బోటు పంపి అతడిని కాపాడాలని బంధువులు వేడుకుంటున్నారు. కాగా, ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. దీంతో 32 గేట్లు ఎత్తేశారు.
ఇది ఇలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి వాగులు, వంకలు ఆందోళనకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాల దగ్గర మున్నేరువాగు నీరు వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో చిల్లకల్లు - వైరా రహదారిపై రాకపోకలు నిలిపివేశారు.

తీరం దాటిన వాయుగుండం
విశాఖ: పూరి-గోపాలపూర్ మధ్య కొద్దిసేపటిక్రితం వాయుగుండం తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఫలితంగా గంటకు 40-50 కి.మీల వేగంలో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు సైతం జారీ చేశారు. కోస్తా, తెలంగాణలో వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 20 సెం.మీల వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications