ఎపిలో రుణమాఫీపై కొర్రీ, ఆనం ఫైర్: టిలో ఛార్జీలు పెరిగేనా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రుణమాఫీ కోసం ఆధార్‌ను లింక్ చేయాలనే ఆలోచనలో ఉంది. రుణమాఫీ కోసం ఆధార్‌ను లింక్ చేయాలనుకుంటున్నట్లు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. అక్రమ లబ్ధిదారులను అరికట్టేందుకే ఈ నిర్ణయమని ఆయన తెలిపారు. చాలామంది నకిలీ పాసు పుస్తకాలతో రుణాలు పొందారని, వారిని నియంత్రించేందుకే ఆధార్ ఆలోచన అన్నారు.
కాగా, ఆధార్ కార్డు లేని వారికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయన్నారు. లేదా ఆధార్ కార్డు తీయించి ఈ పథకంతో లింకప్ చేస్తామన్నారు. ఖరీఫ్ రుణాలను మాఫీ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు.

ఆనం ఆగ్రహం
ఆధార్ లింక్ పైన మంత్రి వివరణ ఇవ్వాలని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రుణాల మాఫీ విషయంలో టిడిపి ప్రభుత్వం కొత్త కొర్రీలు పెడుతోందని విమర్శించారు. ఆధార్ రద్దు చేయాలని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. ఆధార్ కార్డుకు రైతు రుణమాఫీకి లింకేమిటని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయా?
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయా? అనే చర్చ సాగుతోంది. ఆర్టీసీ ఛార్జీలను పదిశాతం పెంచాలని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. అయితే ఛార్జీల పెంపు ప్రతిపాదన రాలేదని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు.
మహేందర్ రెడ్డి బుధవారం ఆర్టీసీ, రవాణా, జీహెచ్ఎంసీ అధికారులతో హైదరాబాదు ట్రాఫిక్ పైన సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ ఇక్కట్ల నుండి వాహనదారులను గట్టెక్కించేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు.
ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి హైదరాబాదీలను గట్టెక్కించేందుకు త్వరలోనే హెచ్ఎండీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, నిపుణులతో ఓ బృందాన్ని తయారు చేసి ముంబై పంపించనున్నామని చెప్పారు. జూలై 2న వారు ముంబై వెళ్తారన్నారు. ముంబైలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు చేసిన ఏర్పాట్లను ఈ బృందం అధ్యయనం చేయనుందన్నారు. ముంబై కంటే మెరుగైన సౌకర్యాలతో హైదరాబాదులో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తామన్నారు.












Click it and Unblock the Notifications