'2019లో చంద్రబాబును దెబ్బతీసేందుకు జగన్-పవన్ కళ్యాణ్‌లకు అసదుద్దీన్ తోడు'
విజయవాడ: తాము ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసమే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ పైన కక్ష కట్టిందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తోందన్నారు.
బీజేపీ కుట్రలు, కుతంత్రాలలో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు పాత్రధారులు అన్నారు. వారిద్దరికి తోడుగా ఇప్పుడు ఏపీలో మజ్లిస్ తోడయిందని ఆరోపించారు. జగన్ తనకు దోస్త్ అని అసదుద్దీన్ అంటున్నారని, బీజేపీతో అంటకాగే జగన్‌కు మజ్లిస్ ఎలా మద్దతిస్తుందని ప్రశ్నించారు.

కేంద్రం దాడులు చేయిస్తోంది
అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ సిద్ధాంతాలను పక్కనపెట్టి బీజేపీ బలపడేలా చేస్తారా అని యనమల ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, విభజన హామీలు నెరవేర్చక పోవడం వల్ల తాను ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చామని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం స్వతంత్ర సంస్థలతో టీడీపీ నేతలపై దాడులు చేయిస్తోందన్నారు. ఏపీ నిధుల విడుదలను కూడా కేంద్రం అడ్డుకుంటోందన్నారు.

2019లో జగన్‌కు ఎలా మద్దతిస్తారు?
2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌కు మద్దతు ఇస్తామని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించడాన్ని యనమల తప్పుపట్టారు. జగన్ తన స్నేహితుడనీ, తాను జగన్ తరఫున ఏపీలో ప్రచారం చేస్తానని అసద్ చెప్పడంపై ఏమిటిని అభిప్రాయపడ్డారు. వైసీపీ అధినేత జగన్ బీజేపీతో అంటకాగుతున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఎలా మద్దతు ఇస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

ఏపీకి ఏమీ ఇవ్వలేదు
ఏపీకి ఇవ్వాల్సిన హామీలు, ఇవ్వాల్సినవి ఏమీ ఇవ్వలేదని యనమల ఆరోపించారు. తొలి ఏడాది ఆర్థిక లోటుకు గత రెండేళ్లుగా పైసా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరానికి రూ.3,400 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు చెందిన రూ.450 కోట్ల నిధులు వెనక్కి తీసుకున్నారని చెప్పారు. నీతి అయోగ్ వెంటనే ఇవ్వాలన్నా బేఖాతరు చేశారని ఆరోపించారు.

చంద్రబాబును దొంగ దెబ్బ తీయాలని
చంద్రబాబును దొంగ దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందని యనమల అన్నారు. బీజేపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాల్లో జగన్, పవన్ పాత్రధారులన్నారు. వీరికి కొత్తగా మజ్లిస్ తోడైందన్నారు. జగన్ తనకు దోస్త్ అని ఒవైసీ అంటున్నారని, పేదల డబ్బు దోచుకున్న జగన్‌కు, అసద్‌కు ఎలా దోస్తీ కుదిరిందో చెప్పాలన్నారు. సిద్ధాంతపరంగా బీజేపీకి మజ్లిస్ వ్యతిరేకమన్నారు. వచ్చే లోకసభ ఎన్నికలకు బీజేపీ కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. టీడీపీపై విమర్శలతో ప్రజల దృష్టి మళ్లించాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వీరి కుట్రలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఏపీకి న్యాయం జరగాలంటే బీజేపీ కూటమిని ఓడించాలన్నారు.












Click it and Unblock the Notifications