విభజన సమస్యలు: గవర్నర్‌తో ఎకె సింగ్ చర్చలు, టీపై ఐవైఆర్ అసంతృప్తి
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించడానికి కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి, నోడల్ అధికారి ఎకె సింగ్ శుక్రవారం హైదరాబాదులో అడుగు పెట్టారు. గవర్నర్ నరసింహన్‌తో ఆయన గంటన్నరకు పైగా చర్చలు జరిపారు. విభజన సమస్యలపై ఆయన గవర్నర్‌తో మాట్లాడినట్లు సమాచారం.
ఆ తర్వాత ఇరు రాష్ర్టాల ఉన్నతాధికారులతో ఏకె సింగ్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విభజన చట్టంలోని హామీల అమలును పర్యవేక్షించేందుకు నోడల్ అధికారిగా కేంద్రం ఏకె సింగ్‌ను నియమించింది. ఏకె సింగ్ ఎదుట ఇరు రాష్ర్టాల అధికారులు తమ వాదనలను వినిపించారు.

ప్రస్తుతం ఇరు రాష్ర్టాల మధ్య పరిస్థితి బాగోలేదని, శాంతియుత వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకోవాలని సింగ్ సూచించారు. లేకపోతే కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఆయన చెప్పారు. ఇరు రాష్ర్టాలు విభజన అంశంపై పట్టువిడుపులు ప్రదర్శించాలని ఆయన సూచించారు. సమావేశంలో రెండు రాష్ర్టాల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, విద్యుత్‌శాఖ అధికారులు, ఉన్నతమండలి అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అధికారుల కేటాయింపు జరిగినప్పటికీ అపరిష్కృత సమస్యలు ఉన్నాయి. ఉమ్మడి సంస్థల విషయం ఇంకా పరిష్కారం కాలేదు. ఈ విషయంపై కూడా గవర్నర్ వద్ద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి సంస్థల్లోని ఉద్యోగులపై, జీతాలపై, వాటిపై ఏ రాష్ట్రానికి అధికారం ఉంటుందనే విషయాలపై అధికారులతో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఎంసెట్ వివాదం, కొన్ని సంస్థల్లోని బ్యాంకు ఖాతాల వివాదం కూడా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.
కొన్ని ఉమ్మడి సంస్థలను తెలంగాణ ఏకపక్షంగా తీసేసుకుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలకు సేవలు అందించాల్సిన ఉమ్మడి సంస్థలు పనిచేయలేని స్థితిలో పడ్డాయని, ఆ సంస్థల్లో ఉద్యోగులు వివక్షను ఎదుర్కుంటున్నారని, స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారి ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications