కీలక దశకు కేసు విచారణ: చంద్రబాబుకు 17వ తేదీలోగా సమన్లు
తిరుపతి: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై 2003 అక్టోబర్ 1వ తేదీన జరిగిన తిరుపతిలోని అలిపిరి వద్ద జరిగిన క్లైమోర్ మైన్స్ దాడికి సంబంధించిన కేసు విచారణ వేగం పుంజుకుంది. ఈ కేసులో 14వ సాక్షిగా ఉన్న చంద్రబాబు నాయుడికి సాక్షి సమన్లు ఈ నెల 17వ తేదీలోగా అందజేసి 17వ తేదీన కోర్టుకు హాజరయ్యేలా చూడాలని న్యాయమూర్తి ఆదేశించారు.
అదే విధంగా కేసులో 13వ సాక్షిగాగ ఉన్న మంత్రి బొజ్జలల గోపాలకృష్ణా రెడ్డికి కూడా సాక్షి సమన్లు ఈ నెల 17వ తేదీలోాగ అందజేసి కోర్టుకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. కేసులో రెండవ సాక్షి, ప్రస్తుత ఏలూరు పోలీసు ట్రైనింగ్ కాలేజీ డిఎస్పీ కె. రాజేశ్వర రెడ్డి బుధవారం కోర్టుకు హాజరయ్యారు.

ఇదివరలో న్యాయమూర్తి జారీ చేసిన బెయిలబుల్ వారెంట్‌ను రీకాల్ చేసుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో చంద్రబాబు కాన్వాయ్ పైలట్ ఆఫీసర్‌గా ఉన్న రాజేశ్వర రెడ్డి సంఘటనను కోర్టుకు వివరించారు.
విచారణ షెడ్యూల్ ప్రకారం సాక్షులను హాజరు పరచకపోవడంపై న్యాయమూర్తి బుధవారం పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణను న్యాయమూర్తి ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు. 2003లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అలిపిరి వద్ద చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications