ఎట్టకేలకు అరసవల్లికి అమరావతి రథం - రైతుల మొక్కులు..!!
అమరావతి రథం అరసవల్లికి చేరింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు ప్రారంభించిన యాత్ర గత ఏడాది నిలిచిపోయింది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో అమరావతి రైతుల రధం నిలిచిపోయింది. గతేడాది సెప్టెంబరు ఒకటో తేదీన అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు మహాపాదయాత్ర ప్రారంభించారు.
అనివార్య కారణాల వల్ల గతేడాది అక్టోబరు 23న యాత్ర నిలిచిపోయింది. రథాన్ని అరసవల్లి తీసుకెళ్లి యాత్రను ముగించాలని రైతులు నిర్ణయించారు. అందులో భాగంగా తిరిగి ప్రారంభమైన యాత్రతో ఎట్టకేలకు అరసవల్లికి రథం చేరుకుంది. ఆదివారం అమరావతి రైతులు.. అరసవల్లి శ్రీసూర్యభగవానుడ్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం 2019 డిసెంబర్ లో మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది. దీనిని తొలి నుంచి అమరావతి రైతులు వ్యతరేకిస్తున్నారు. జేఏసీగా ఏర్పాటై ఆందోళన కొనసాగిస్తున్నారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతి వరకు తొలి విడత యాత్ర నిర్వహించారు. ముగింపు వేళ తిరుపతిలో అన్ని పార్టీలతో బహిరంగ సభ నిర్వహించారు.
గత ఏడాది మహా పాదయాత్ర పేరతో అమరావతి టు అరసవల్లి యాత్ర ప్రారంభించారు. ఈ రెండో విడత యాత్ర కొనసాగింపు సమయంలో అనేక ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. న్యాయస్థానాల వరకు వివాదాలు వెళ్లాయి. పాదయాత్ర కొనసాగించే పరిస్థితులు లేకపోవటంతో అక్కడే రామచంద్రపురం లో నిలిచిపోయింది.
ఇక, ఇప్పుడు యాత్రను ముగించాలనే ఉద్దేశంతో రథంను అరసవల్లిక తీసుకొచ్చారు. రైతులు అమరావతి నుంచి పెద్ద సంఖ్యలో బస్సులు, కార్లలో అరసవల్లికి చేరుకున్నారు. అమరావతి నుంచి రైతులకు స్థానిక టీడీపీ నేతలు వసతి ేర్పాటు చేసారు.
ఈ రోజు వారంతా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అటు అమరావతి రాజధాని కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. గత నెల 28న ఈ కేసును విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు జూలై 11వ తేదీకి వాయిదా వేసింది. త్వరగా విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఎన్నికల ఏడాది కావటంతో ఏపీలో రాజధాని అంశం కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications