ఇండియన్ రైల్వే సూపర్ న్యూస్: 30న అమృత్ భారత్
వందే భారత్ తరహాలో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు (Amrit Bharat Express) త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. డిసెంబర్ 30న ప్రధాని మోదీ ఈ రైళ్లను అయోధ్యలో ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రెండు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు మరో ఆరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లనూ ప్రధాని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రధాని మంత్రి కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
30న ప్రారంభం : ప్రధాని మోదీ అయోధ్యలో నిర్మించిన విమానాశ్రయాన్ని 30న ప్రారంభించనున్నారు. అదే రోజు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రారంభించే అవకాశం ఉంది. దిల్లీ-దర్బంగా (బిహార్)మార్గంలో ఒకటి, బెంగాల్‌లోని మాల్దా- బెంగళూరు మధ్య మరో అమృత్ భారత్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు మరో ఆరు వందే భారత్ రైళ్లను సైతం ప్రధానమంత్రి ప్రారంభించబోతున్నారు. అయోధ్య- ఆనంద్ విహార్ (దిల్లీ), వైష్ణోదేవి- దిల్లీ, జాల్నా- ముంబయి, కోయంబత్తూర్- బెంగళూరు, అమృత్‌సర్ - దిల్లీ, మంగళూరు సెంట్రల్ - మడ్గావ్ మధ్య ఇవి నడవనున్నాయి.

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఫీచర్లు : అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది నాన్ ఏసీ పుష్-పుల్ రైలు. ముందూ వెనుక ఇంజన్లు ఉంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ వేగాన్ని అందుకుంటుంది. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. మొత్తం 22 కోచ్ లు ఉంటాయి. వీటిల్లో త్రీటైర్ స్లీపర్ బోగీలు 12, జనరల్ బోగీలు 8, రెండు గార్డు కంపార్ట్ మెంట్స్ ఉంటాయి. వీటిల్లో కొంత భాగాన్ని స్త్రీలకు, దివ్యాంగులకు కేటాయిస్తారు. 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. టికెట్ ధరలు ఎలా ఉండాలి? భవిష్యత్తులో ఏయే మార్గాల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.












Click it and Unblock the Notifications