Weather Update: వేసవి వచ్చేసింది కానీ.. 3 రోజులు వర్షాలే
రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. క్యాలెండర్‌లో ఇంకా ఫిబ్రవరి నెల కూడా పూర్తికాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా మార్చి రెండో వారం నుంచి పెరగాల్సిన ఉష్ణోగ్రతలు, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయికి చేరుతున్నాయి. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఎండలు మండుతుండగానే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాతావరణంలో అనిశ్చితిని సృష్టిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ఆదివారం నాటికి మరింత బలపడి 'తీవ్ర అల్పపీడనంగా' మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది ప్రస్తుతం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతున్నప్పటికీ, రాబోయే 48 గంటల్లో ఈశాన్యం వైపు మళ్లే (Recurve) అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Weather Update: రికార్డ్ స్థాయిలో ఉష్టోగ్రతలు
ముఖ్యంగా నందిగామ, కర్నూలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. తీర ప్రాంతాలైన విశాఖపట్నం, తుని, నరసాపురం, బాపట్లలో సైతం సాధారణం కంటే 2 నుండి 3.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
మూడు రోజుల పాటు వర్షాలు.. పిడుగుల హెచ్చరిక
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆది, సోమవారాల్లో తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
అటు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జల్లులు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తర కోస్తాలో నైరుతి గాలులు, దక్షిణ కోస్తాలో ఆగ్నేయ గాలులు వీస్తుండటంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎండల నుంచి ఉపశమనం లభించినప్పటికీ, వర్షం కురిసే సమయంలో బయటకు రావద్దని అధికారులు ప్రజలను కోరుతున్నారు.












Click it and Unblock the Notifications