రాష్ట్రంలో నేటి నుంచే మరో నూతన విధానం."పిల్లలే సంపద"
"దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ అప్పారావు గారి మాటలను మరోసారి గుర్తుచేసుకోవాల్సిన సమయం వచ్చింది. జనం ఉంటేనే అభివృద్ధి సార్థకమవుతుంది, జనాభా ఉంటేనే నిజమైన భవిష్యత్తు ఉంటుంది" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడలోని అంబేడ్కర్ కళావేదిక వద్ద వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2026 ఏడాది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని చెబుతూ.. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచే 'పిల్లలే సంపద' అనే నూతన విధానానికి నాంది పలుకుతున్నట్లు సీఎం ప్రకటించారు.
ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాంగణంలో వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య కళాశాలల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

నాడు నియంత్రణ.. నేడు పాపులేషన్ మేనేజ్‌మెంట్
సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గతంలో జనాభా పెరిగిపోతుందన్న ఆందోళనతో ప్రభుత్వాలు నియంత్రణ వైపు అడుగులు వేశాయని గుర్తు చేశారు.
"అప్పట్లో మహిళల్లో అక్షరాస్యత పెంచడం ద్వారానే జనాభా నియంత్రణ సాధ్యమని భావించాం. 'ఒక్కరు ముద్దు.. ఇద్దరితో సరి.. ముగ్గురు వద్దు' అంటూ ప్రచారాలు చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హులనే నిబంధనలు కూడా తెచ్చాం. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రస్తుతం జనాభా నియంత్రణ కాదు.. 'జనాభా సంరక్షణ, నిర్వహణ' అత్యంత కీలకం" అని సీఎం స్పష్టం చేశారు.
యువత కేవలం 'మైక్రో ఫ్యామిలీల' (చిన్న కుటుంబాల) వైపు మొగ్గు చూపడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో జనాభా గణనీయంగా తగ్గిపోతోందని, భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో అంగన్‌వాడీలు, పాఠశాలల్లో చిన్నారుల సంఖ్య తగ్గిపోతోందని, వృద్ధుల సంఖ్య పెరుగుతోందని.. ప్రతి 100 మంది జనాభాలో 89 శాతం మందికి మొదటి, రెండో సంతానం లేకపోవడం ఆలోచించాల్సిన విషయమన్నారు. విశాఖపట్నం లాంటి జిల్లాల్లో ఫెర్టిలిటీ రేటు (సంతానోత్పత్తి రేటు) అతి తక్కువగా ఉందని, ఏపీ విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉన్నా పాపులేషన్ డెన్సిటీలో వెనుకబడి ఉన్నామని, అందుకే రాష్ట్రంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
అప్పుడు ఐటీ.. ఇప్పుడు ఏఐ.. రేపటి లక్ష్యం స్వర్ణాంధ్ర!
20 ఏళ్ల క్రితం తాము తీసుకున్న ఐటీ విప్లవ నిర్ణయాల వల్లే నేడు ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగువారే కనిపిస్తున్నారని, అత్యధిక ఆదాయం సంపాదిస్తూ సంపద సృష్టిస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. "అప్పుడు ఐటీ గురించి మాట్లాడాను.. ఇప్పుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పాటు పాపులేషన్ మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడుతున్నాను. జనాభా లేకపోతే మనం సాధించాలనుకున్న అభివృద్ధి లక్ష్యాలను చేరుకోలేం. 15 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగితే 2040 నాటికే 'స్వర్ణాంధ్ర' సాధిస్తాం. అలాగే, 2047 నాటికి మన రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు చేర్చాలన్నదే నా సంకల్పం" అని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందుకోసం 'పీ4' (People Public Private Partnership) విధానం ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచుతున్నామని, మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో సమతూక అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాలకూ పరిశ్రమలు, ప్రాజెక్టులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
పిల్లల పెంపకం ఉమ్మడి బాధ్యత.. సిజేరియన్లు తగ్గాలి!
పిల్లలను పెంచడం అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదని, అది భార్యాభర్తలిద్దరి ఉమ్మడి బాధ్యత అని సీఎం చంద్రబాబు హితవు పలికారు. పురుషులు కూడా పిల్లల పెంపకంలో సమానంగా బాధ్యతలు పంచుకోవాలని సూచించారు. మహిళల ఆరోగ్య రక్షణ అత్యంత కీలకమని, కాన్పుల్లో అనవసర సిజేరియన్లను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగం చేసే మహిళల కోసం పని ప్రదేశాల్లో త్వరలోనే 'చైల్డ్ కేర్ కేంద్రాలు' ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వం ఇప్పటికే అంగన్‌వాడీల నుంచే పిల్లల ఆరోగ్యంతో పాటు పౌష్టిక ఆహారం అందిస్తోందని, పాఠశాలల్లో నాణ్యమైన విద్య కోసం 'తల్లికి వందనం' కింద ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున అందిస్తున్నామని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఇప్పటికే 'సంజీవని' కార్యక్రమం చేపట్టామని, త్వరలోనే ప్రభుత్వం 'క్షేమం' అనే మరో నూతన కార్యక్రమాన్ని తీసుకురావడానికి ఆలోచన చేస్తోందని వెల్లడించారు. భారతదేశానికే సొంతమైన అద్భుతమైన వరం 'కుటుంబ వ్యవస్థ' అని, ఈ వారసత్వాన్ని కాపాడుకుంటూ ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
సోషల్ మీడియా వ్యసనంపై సీఎం ఆందోళన.. తెలంగాణ ఘటనపై విచారం
ఇదే వేదికపై నుంచి తెలంగాణలో జరిగిన ఒక దారుణ ఉదంతంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోక్సో (POCSO) కేసు ఉన్న ఒక నిందితుడు.. తనపై కేసు పెట్టిన వారి కుటుంబ సభ్యులనే దారుణంగా హత్య చేయడం అత్యంత బాధాకరమన్నారు. సమాజంలో ఇలాంటి నేరాలు పెరగడానికి సోషల్ మీడియా బాధ్యతారహిత వినియోగం కూడా ఒక కారణమని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన, హింసాత్మక దృశ్యాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా యువతకు వ్యసనంగా మారితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తూ.. యువత 'టెక్నాలజీ - స్పిరిచువాలిటీ' (సాంకేతికత-ఆధ్యాత్మికత) కలయిక ద్వారా ప్రపంచాన్ని జయించే శక్తిని సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత నిరంతరం నైపుణ్యాలను (Skills) పెంపొందించుకుంటూ దేశానికి నాణ్యమైన వర్క్ ఫోర్స్‌గా మారాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.














Click it and Unblock the Notifications