వైసీపీ ఎమ్మెల్సీకి కీలక పదవి- మారుతున్న లెక్కలు..!!
ఏపీ రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి- వైసీపీ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా రెండు వైపులా ఎత్తుగడలు మొదలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ లక్ష్యంగా కూటమి నేత లు.. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జగన్ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీకి ప్రస్తుతం కీలక పదవి దక్కటం ఆసక్తి కరంగా మారుతోంది. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం దాదాపు 26 నెలల పాలన పూర్తి చేసుకుంటోంది. వైసీపీ లక్ష్యంగా వచ్చే ఎన్నికల కోసం కేడర్ ను సిద్దం చేస్తోంది. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పట్టు నిరూపణ దిశగా కార్యాచరణ అమలుకు సిద్దం అయింది. రెండు వైపులా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రణాళిక లు అమలు చేస్తున్నారు. ఈ సమయంలోనే కీలక పదవి వైసీపీ ఎమ్మెల్సీకి దక్కనుంది. ఈ పదవి ఎవరికి ఇవ్వాలో జగన్ దాదాపు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జకియా ఖానం పదవీకాలం ముగుస్తుండటంతో కొత్త అభ్యర్థి ఎంపిక అనివార్యమైంది. ఆమె స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో వైసీపి అధినేత ఎవరికి ఈ పదవి ఇవ్వాలో సుదీర్ఘ కసరత్తు చేసారు. సామాజిక సమీకరణాలు, మరియు సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని తూమాటి మాధవరావు వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

పార్టీ నేతలతో కసరత్తు...తుది నిర్ణయం
అసెంబ్లీలో కూటమికి పూర్తి మెజార్టీ ఉండగా.. ప్రస్తుతం శాసనమండలిలో వైసీపికి పూర్తి స్థాయి స్పష్టమైన బలం ఉన్న నేపథ్యంలో ఆయన ఎన్నిక దాదాపు ఏకగ్రీవంగా లాంఛనం కానుంది. మండలిలో పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్న నేతగా జగన్ మాధవ రావు పేరు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీసీ వర్గానికి చెందిన మహిళా నేత వరుదు కల్యాణి పేరు పరిశీలన లోకి వచ్చింది. అయితే.. ప్రస్తుతం పార్టీ వాయిస్ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్న వరుదు కల్యాణ్ కి పార్టీ బాధ్యతల్లోనే కొనసాగించటం మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో, చివరి నిమిషంలో మార్పులు జరగకుంటే... శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా మాధవ రావు పేరు ప్రకటన ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications