వాతావరణంలో ఊహించని మార్పు.. సగం దేశాన్ని కమ్మిన మేఘాలు
మన దేశంలో ఒకే సమయంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనడం సర్వసాధారణమే అయినప్పటికీ, ఈసారి అది అంతరిక్షం నుంచి చూసేందుకు ఎంతో విచిత్రంగా కనిపిస్తోంది. మన దేశానికి చెందిన అత్యాధునిక 'ఇన్శాట్-3డీఎస్' (INSAT-3DS) ఉపగ్రహం అందించిన తాజా చిత్రాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. భారత ఉపఖండంపై ఒకవైపు దట్టమైన మేఘాలు కమ్ముకుని కుంభవృష్టి కురిపిస్తుంటే, మరోవైపు వాయువ్య ప్రాంతంలో మాత్రం ఆకాశం ఎంతో ప్రశాంతంగా, స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అద్భుత దృశ్యం వాతావరణ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సెప్టెంబర్ 24న ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహంలోని థర్మల్-ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ద్వారా 10.83 మైక్రోమీటర్ల వేవ్ లెంత్ వద్ద ఈ అద్భుత చిత్రాలను బంధించారు. ఈ ఫోటోల్లో సగం దేశం దట్టమైన మేఘాలతో కప్పబడింది. ఇవి తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు సంకేతమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మధ్య, తూర్పు, దక్షిణ భారతంపై దట్టమైన మేఘాల తాకిడి..
ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే దేశంలోని మధ్య ప్రాంతం నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాల వరకు భారీ మేఘాలు విస్తరించి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమతో కూడినగాలులు భారత భూభాగంపై పెద్ద ఎత్తున మేఘాలను సృష్టిస్తున్నాయి. దీనివల్ల ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ తదితర ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
వాయువ్య భారత్‌లో మాత్రం పూర్తిగా తేలికైన ఆకాశం..
దేశంలోని ఒకవైపు వర్షాలు దంచికొడుతుంటే, మరోవైపు రాజస్థాన్, గుజరాత్, వాయువ్య ప్రాంతాలలో మాత్రం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ ఎలాంటి మేఘాల అడ్డులేకుండా ఆకాశం నిర్మలంగా కనిపిస్తోంది. ఈ రెండు ప్రాంతాల మధ్య కనిపించే ఈ స్పష్టమైన వ్యత్యాసమే ఇప్పుడు వాతావరణ రంగంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
అల్పపీడన ప్రభావంతోనే ఈ భారీ మార్పులు..
ఉత్తర కోస్తా దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడుతూ లోపలికి కదలడమే ఈ వర్షాలకు ప్రధాన కారణం. దీని ప్రభావంతో తూర్పు, మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముగింపు దశకు నైరుతి రుతుపవనాలు..
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు దేశంలోని వాయువ్య ప్రాంతాల నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమైంది. అయినప్పటికీ బంగాళాఖానంలో ఏర్పడే వాతావరణ వ్యవస్థల కారణంగా మధ్య - తూర్పు భారతదేశంలో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే రాబోయే 24 నుంచి 48 గంటల్లో ఈ వాయుగుండం మరింత బలహీనపడే అవకాశం ఉన్నందున, ఈ మేఘాల సరళి కూడా వేగంగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.














Click it and Unblock the Notifications
