మా 36 మంది ఎమ్మెల్యేల త్యాగాన్ని కేంద్రానికి పణంగా పెడతారా?
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) బిల్లుకు మద్దతు ఇవ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించింది కూడా. ఎన్సీపీ- ఎస్పీ తీసుకున్న ఈ నిర్ణయం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది. ఇది.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలపడంతోనే ఆగిపోదని, ఎన్డీఏ కూటమితో పొత్తు దిశగా ఈ పార్టీ చర్చలు జరుపుతోందనే ప్రచారం సైతం సాగుతోంది.
ఈ పరిణామాలపై మహారాష్ట్ర కాంగ్రెస్ స్పందించింది. ఎన్సీపీ ఎస్పీ నిర్ణయాన్ని తప్పుపట్టింది. గతంలో తాము చేసిన త్యాగాలను గుర్తు చేసింది. రాజ్యసభ ఎన్నికల ఘట్టాన్ని తెరపై తీసుకొచ్చింది. శరద్ పవార్‌ను మళ్లీ రాజ్యసభకు పంపడానికి చివరి వరకు తాము అండగా నిలిచామని పేర్కొంది. మహారాష్ట్రలో ఏడు రాజ్యసభ స్థానాలకు జరిగిన నాటి ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలవడానికి 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, ఎన్సీపీ- ఎస్పీ వద్ద 10 మంది మాత్రమే ఉన్నారని పేర్కొంది.

ఆ సమయంలో సుప్రియా సూలే స్వయంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని కలసి శరద్ పవార్ అభ్యర్థిత్వానికి మద్దతు కోరారని వివరించింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎలాంటి సంకోచం లేకుండా తమ సొంత స్థానాన్ని త్యాగం చేసి శరద్ పవార్‌కే మద్దతిచ్చారని తెలిపింది. కాంగ్రెస్- 16, శివసేన (ఉద్ధవ్ థాకరే)కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, మహా వికాస్ అఘాడీ ఏకగ్రీవ నిర్ణయంతో శరద్ పవార్ పెద్దల సభలో అడుగు పెట్టగలిగారని, ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో బీజేపీకి మద్దతు ఇవ్వడంపై ఎంతమాత్రం సమంజసం కాదని వ్యాఖ్యానించింది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు, డీలిమిటేషన్ బిల్లుపై ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేడు ఇండియా కూటమి నాయకుల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీకి ఎన్సీపీ- ఎస్పీ సీనియర్ నాయకురాలు, బారామతి లోక్ సభ సభ్యురాలు సుప్రియా సూలే హాజరు కావట్లేదు. శరద్ పవార్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరడం వల్ల తాను సోమవారం రోజే ఢిల్లీకి వెళ్లనున్నట్లు ఆమె తెలిపారు. ఈ భేటీకి తమ పార్టీ తరఫున ఇతర ప్రతినిధులు హాజరవుతారని ఆమె స్పష్టం చేశారు.
డీలిమిటేషన్ వంటి కీలక రాజ్యాంగ సవరణ బిల్లుపై ఇండియా కూటమి పక్షాల మధ్య సయోధ్య లోపించడం ప్రతిపక్షాల వ్యూహానికి పెద్ద విఘాతంగా మారింది. శరద్ పవార్ వర్గం అధికార పక్షానికి అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ బంధంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ రాజకీయ పరిణామాలు ఏ దిశగా సాగుతాయోనేది చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications
