IIT Placements: ఏఐ దెబ్బకు ఐఐటీల్లో మారిన ట్రెండ్- వీరికే ప్లేస్ మెంట్స్- జాబ్ కావాలంటే?
మన దేశంలో ప్రతిష్టాత్మక ఉన్నత విద్యాసంస్థలుగా పేరున్న ఐఐటీల్లో ఈ ఏడాది ప్లేస్ మెంట్స్ భారీగా పడిపోయాయి. ఏఐ రాకతో ఇండస్ట్రీలో వేగంగా మారుతున్న పరిస్ధితులే ఇందుకు కారణం. దీంతో ఇన్నాళ్లూ సగటు మధ్యతరగతి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు మినిమిం గ్యారంటీగా కనిపించిన చాలా ఐటీ ఉద్యోగాల్ని కల్పించేందుకు టెక్ దిగ్గజాలు ముందుకు రావడం లేదు. వీటి స్ధానంలో స్టార్టప్ లు మాత్రమే ఏఐ, డేటా సైన్స్ ఉద్యోగాలు ఎక్కువగా కల్పిస్తున్నాయి. మొత్తంగా ఈ ఏడాది ఐఐటీ ప్లేస్ మెంట్స్ (IIT Placements) తీరు ఎలా ఉందో ఓసారి చూద్దాం..
ఐఐటీ ప్లేస్ మెంట్స్ లో కీలక మార్పులు (IIT Placements)
ఈ ఏడాది ఐఐటీ ప్లేస్ మెంట్స్ విషయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కంపెనీలు క్యాంపస్ రిక్రూట్ మెంట్లను బారీగా తగ్గించేశాయి. అలాగే నియామకాల్లోనూ 30 శాతం వరకూ కోత విధించాయి. దీంతో క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో సైతం పోటీ పెరిగింది. ఐఐటీ కాన్పూర్ కు గూగుల్, ఐఐటీ ఖరగ్ పూర్ కు గూగుల్, యాపిల్ మొహం చాటేశాయి. మైక్రోసాఫ్ట్ సైతం అత్యున్నత ప్రతిభావంతులకు అంటే 9కి పైగా సీజీపీఏ ఉన్న వారికి మాత్రమే నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తోందని కెరీర్స్ 360 డాట్ కామ్ వెబ్ సైట్ నివేదించింది. అదే సమయంలో ఐఐటీ కాన్పూర్ తో పాటు మరికొన్ని చోట్ల సంప్రదాయ ఐటీ ఉద్యోగాల కంటే ఏఐ, డేటా సైన్స్ ఉద్యోగాలకు ప్లేస్ మెంట్స్ లో డిమాండ్ ఉంది.

టెక్ దిగ్గజాలు దూరం-స్టార్టప్ లే గతి
మారిన పరిస్ధితుల్లో టెక్ దిగ్గజాలతో పోలిస్తే స్టార్టప్ లే ఐఐటీ ప్లేస్ మెంట్స్ లో ఎక్కువగా పాల్గొంటున్నాయి. ఇవి కూడా ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ స్కిల్స్ ఉన్న అభ్యర్ధులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఇలా స్టార్టప్ లు క్యాంపస్ రిక్రూట్ మెంట్లకు వస్తున్న ఐఐటీల జాబితాలో ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బోంబే, ఐఐటీ బీహెచ్యూ వంటి సంస్థలు ఉన్నాయి. అలాగే పలు ఐఐటీల్లో క్యాంపస్ నియామకాలు తగ్గుతున్నా .. కంపెనీలు ఆఫర్ చేస్తున్న ప్యాకేజీల్లో సైతం ఎలాంటి మార్పూ ఉండటం లేదని తెలుస్తోంది. పెరుగుతున్న పోటీయే ఇందుకు కారణం.

జేఈఈ అభ్యర్ధులు చేయాల్సింది ఇదే
దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం జేఈఈకి సిద్ధమవుతున్న అభ్యర్ధులు.. ఐఐటీల్లో సీటు కొడితే చాలదు, అక్కడ చేరిన తర్వాత పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ది చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్దమవుతోంది. ముఖ్యంగా ప్రోగ్రామింగ్ , కోడింగ్ నైపుణ్యాలు, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, ప్రాక్టికల్ ప్రాజెక్టులు, ఇంటర్న్ షిప్ లు, మ్యాథ్స్ సమస్యలను పరిష్కరించే సామర్ధ్యాలు, రోబోటిక్స్, ఆటోమేషన్, అడ్వాన్సెడ్ టెక్నాలజీ వంటి అంశాలపై పట్టు సంపాదించాలని నిపుణులు చెప్తున్నారు. లేకపోతే ఐఐటీల్లో గ్రాడ్యుయేట్లు అయినా, ప్రస్తుత పరిస్ధితుల్లో ఉద్యోగాలకు గ్యారంటీ లేదని చెప్తున్నారు.














Click it and Unblock the Notifications
