రెండో టెస్ట్ లో కష్టాల్లో టీమిండియా: ప్రారంభంలోనే డబుల్ షాక్
భారత్ తో క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 356 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆటలో బౌలర్లు సత్తా చాటారు. ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ అయిదు వికెట్లతో రప్ఫాడించాడు. అతని ధాటికి బ్యాటర్లెవరూ పెద్దగా నిలవలేకపోయారు. పెవిలియన్ కు క్యూ కట్టారు. ఓవర్ నైట్ స్కోర్ కు మరో 110 పరుగులు మాత్రమే జోడించింది న్యూజిలాండ్. చివరి అయిదు వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది.
మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 246/5 స్కోరుతో నిలిచిన న్యూజిలాండ్.. రెండో రోజు మిగిలిన అయిదు వికెట్లు కోల్పోయి 356 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్ 89 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ టామ్ లేథమ్ 59, గ్లెన్ ఫిలిప్స్- 36, నాథన్ స్మిత్- 26, డెవాన్ కాన్వే- 31 పరుగులు సాధించి జట్టుకు మంచి స్కోరు అందించారు. న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ ను ఆకాష్ దీప్ కుప్పకూల్చాడు. మొత్తం అయిదు వికెట్ల తన ఖాతాలో వేసుకున్నాడు.

టామ్ లాథమ్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, కైలె జెమిసన్, మ్యాట్ హెన్రీ వికెట్లను తీసుకున్నాడు. అన్షుల్ కాంబోజ్-2, గుర్నూర్ బ్రార్- 2, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ పడగొట్టారు. జస్‌ప్రీత్ బుమ్రా నిరాశపరిచాడు. 26 ఓవర్లు వేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. వికెట్ల కోసం తన బౌలింగ్ స్టైల్ ను కూడా మార్చుకోవాల్సొచ్చిందతనికి. అయినప్పటికీ ఉపయోగం లేకుండాపోయింది. బుమ్రాను సమర్థవంతంగా ఎదుర్కొనగలిగారు న్యూజిలాండ్ బ్యాటర్లు.
టీమిండియా ఇన్నింగ్ కూడా ఆశించిన స్థాయిలో ఆరంభం కాలేదు. ప్రారంభంలోనే డబుల్ షాక్ తగిలింది. రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టాప్ ఆర్డర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ వెనుదిరిగాడు. మ్యాట్ హెన్రీ, కైలె జెమిసన్ ఈ రెండు వికెట్లు తీసుకున్నారు. మొదటి ఓవర్ లోనే వికెట్ కోల్పోయింది టీమిండియా. ఓపెనర్ యశస్వి జైస్వాల్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు.
మ్యాట్ హెన్రీ వేసిన ఇన్నింగ్ మొదటి ఓవర్ చివరిబంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ బయట మొదటి అయిదు బంతులు వేసిన హెన్రీ ఆ తర్వాత స్టంప్స్ ను లక్ష్యంగా చేసుకుని,బ్రేక్‌త్రూ సాధించాడు. హెన్రీ వేసిన గుడ్ లెంగ్త్ డెలివరీని యశస్వి జైస్వాల్ అడ్డుకోలేకపోయాడు. ఈ అవుట్ స్వింగర్ ను అంచనా వేయలేకపోయాడు. 131 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఆ బంతి.. ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టింది.
అతని తర్వాత క్రీజ్ లోకి వచ్చిన పడిక్కల్ ధాటిగా ఆడినప్పటికీ ఎక్కువ సేపు క్రీజ్ లో నిల్చోలేకపోయాడు. జేమీసన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ బ్లండెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అదొక పేలవమైన షాట్. ఆఫ్ స్టంప్ బయట పిచ్ అయిన ఫుల్ లెంగ్త్ డెలివరీని డ్రైవ్ ఆడబోయి ఎడ్జ్ తీసుకున్నాడు. ఆ బంతి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లో వాలింది.













Click it and Unblock the Notifications
