ఫేషియల్ రికగ్నిషన్ హాజరుతోనే టీచర్ లకు వేతనాలు.. జిల్లాల్లో కలెక్టర్ల కఠిన నిఘా!
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి ఇకపై ముఖ గుర్తింపు హాజరు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ - ఎఫ్‌ఆర్‌ఎస్ ఆధారంగానే వేతనాలు విడుదల చేసే దిశగా పాలనా యంత్రాంగం అడుగులు వేస్తోంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్తించే లిఖితపూర్వక ఉత్తర్వులు ఇంకా వెలువడకపోయినా, జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు పలుచోట్ల జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తున్నారు.
2025 ఆగస్టు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కోసం ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు విధానం అందుబాటులోకి వచ్చింది. ప్రాక్సీ హాజరును అరికట్టడం, పాఠశాలల్లో సమయపాలన పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. అయినప్పటికీ కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ కొందరు టీచర్లు యాప్‌లో హాజరు వేయకుండా పాత పద్ధతిలోనే రిజిస్టర్లలో సంతకాలతో సరిపెడుతున్నట్లు అధికారులు గుర్తించారు. డైరెక్టరేట్ స్థాయిలో ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఆశించిన స్థాయిలో మార్పు రాకపోవడంతో, తాజాగా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో కఠిన పర్యవేక్షణ మొదలుపెట్టారు.

ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు జిల్లాల్లో టీచర్లు, విద్యార్థుల హాజరు తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరును సీరియస్‌గా తీసుకొని నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు ఆధారంగానే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వేతనాల బిల్లులు రూపొందించి పంపాలని డీఈఓ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, సిబ్బందికి ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు ప్రకారమే జీతాలు చెల్లిస్తామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ స్పష్టం చేశారు. ప్రతిరోజూ హాజరు నివేదికలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదే విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గతంలో హాజరు నమోదు చేయని ఉపాధ్యాయులపై షోకాజ్ నోటీసులు జారీ చేయడం వంటి చర్యలతో అధికారులు కఠినంగా వ్యవహరించారు.
నవంబరు, డిసెంబరు నెలల్లో విద్యార్థుల హాజరు 95 శాతానికి తగ్గకూడదని, టీచర్లు కూడా అత్యవసరమైతే తప్ప సెలవులు పెట్టవద్దని విద్యాశాఖ సూచించింది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో టీచర్లు సెలవు తీసుకోవాలంటే అదనపు కలెక్టర్ అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ ఆదేశించడం చర్చనీయాంశమైంది. విద్యాశాఖ 2026 నవంబరును 'ప్రత్యేక హాజరు మాసం'గా ప్రకటించి, విద్యార్థులు మరియు టీచర్ల హాజరును 100 శాతానికి చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సర్వర్ లోపాలు, జీపీఎస్ సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ ఇబ్బందులు వంటి సాంకేతిక అడ్డంకులపై ఉపాధ్యాయులు తరచూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య స్పందిస్తూ.. ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు ఆధారంగా వేతనాలు ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే క్షేత్రస్థాయి సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతే స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు.













Click it and Unblock the Notifications
