విద్యుత్ వినియోగదారులకు శుభవార్త: ట్రూడౌన్ తో రూ.629.35 కోట్ల బెనిఫిట్ మీకే!
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు మళ్లీ శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి గురువారం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.629.35 కోట్లు ట్రూడౌన్ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ మొత్తాన్ని వినియోగదారుల భవిష్యత్ బిల్లుల్లో సర్దుబాటు చేయాలని సూచించింది. ముఖ్యంగా 2027-28 రిటైల్ సప్లై టారిఫ్ ఆర్డర్‌లో ఈ సర్దుబాటు చేయాలని డిస్కంలకు ఆదేశాలు ఇచ్చింది.
డిస్కంలు ప్రతి ఏడాది విద్యుత్ కొనుగోలు, పంపిణీ ఖర్చులను అంచనా వేసి టారిఫ్ ను నిర్ణయిస్తాయి. అయితే ఏడాది ముగిసిన తర్వాత అసలు ఖర్చులు లెక్కించినప్పుడు, అంచనా కంటే తక్కువ ఖర్చు అయితే లేదా, వినియోగదారుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు అయితే ఆ మిగులు మొత్తాన్ని తిరిగి వినియోగదారులకు సర్దుబాటు చేయడమే ట్రూడౌన్. దీని వలన వినియోగదారులకు లబ్ది జరుగుతుంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది వరుసగా రెండో ఏడాది ట్రూడౌన్. గతంలో 2024-25కి రూ.924 కోట్లు ట్రూడౌన్ చేశారు. ఆ మొత్తాన్ని 2025 నవంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు ప్రతి నెలా బిల్లులో యూనిట్‌కు 13 పైసల చొప్పున తగ్గిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ ఏడాది కూడా వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
డిస్కంలు మొదట రూ.940.07 కోట్లు ట్రూడౌన్ చేయాలని ప్రతిపాదించాయి. 2025-26లో మూడు డిస్కంలు కలిపి 70,884.71 మిలియన్ యూనిట్ల విద్యుత్ విక్రయించాయి. ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద యూనిట్‌కు 40 పైసల చొప్పున వసూలు చేసిన మొత్తం రూ.2,800.28 కోట్లు. అయితే అనుమతించిన ఖర్చులు పోను మిగులు లెక్కల్లో తేడా వచ్చింది.
కమిషన్ పరిశీలన తర్వాత ఎస్‌పీడీసీఎల్‌లో రూ.675.10 కోట్లు, సీపీడీసీఎల్‌లో రూ.65.50 కోట్లు ట్రూఅప్ అవసరమని, ఈపీడీసీఎల్‌లో రూ.1,369.95 కోట్లు ట్రూడౌన్ ఉందని తేల్చింది. వీటిని సర్దుబాటు చేసి మొత్తం రూ.629.35 కోట్లు వినియోగదారులకు లబ్ధి చేకూరేలా నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో విద్యుత్‌పై అదనపు భారం వేయబోమని హామీ ఇచ్చింది.
ఆ మాట ప్రకారం గత రెండేళ్లలో అదనపు ఛార్జీలు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో ట్రూఅప్, ఇంధన సర్‌ఛార్జి, విద్యుత్ సుంకం పేరుతో రూ.32,166 కోట్ల భారాన్ని వినియోగదారులపై వేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఆ ధోరణిని మార్చి వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తోంది. ఈ నిర్ణయం వల్ల సాధారణ ప్రజలకు, వ్యాపారులకు కొంత ఆర్థిక భారం తగ్గుతుంది.













Click it and Unblock the Notifications
