వైసీపీకి సీపీఐ స్నేహ హస్తం, కలిసి పోరాడుదాం - జగన్ ఏం చెప్పారు..!!
ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు. ఇప్పటి వరకు ఎలాంటి పొత్తులు లేకుండా పార్టీ ఆవిర్భావం నుంచి ఒంటరిగా రాజకీయం చేస్తున్న వైసీపీకి కొత్త ఆఫర్ వచ్చింది. తాజాగా సీపీఐ నేతలు మాజీ సీఎం జగన్ ను కలిసారు. స్నేహ హస్తం అందించారు. డీఎస్సీ అంశంతో సహా ప్రజా సమస్యల పైన కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. జగన్ తో సుదీర్ఘంగా సాగిన సీపీఐ నేతల సమావేశం.. జగన్ నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ తో సీపీఐ కీలక నేతలు సమావేశం అయ్యారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి. హరినాథరెడ్డి తదితరులు జగన్‌ను కలిశారు. ఏపీలో వర్షా భావం, వ్యవసాయ సమస్యలపై తొలుత చర్చించారు. ఈ సమస్యల పైన సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26న విజయవాడలో నిర్వహించనున్న రౌండ్‌టేబుల్ సమావేశానికి వైఎస్సార్‌సీపీని ఆహ్వానించినట్లు సీపీఐ నేతలు తెలిపారు. రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో పాల్గొనాలని వైసీపీని సీపీఐ నేతలు ఆహ్వానించారు. ఇదే సమయంలో రాజకీయంగానూ కీలక చర్చలు జరిగాయి.

సీపీఐ కీలక ప్రతిపాదన
ఎన్నికల సంఘం తాజా వివాదంతో పాటుగా సర్ ప్రక్రియలో భాగంగా ఓట్ల తొలిగింపు అంశం పైనా జగన్ తో చర్చించినట్లు ఈశ్వరయ్య వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు ఉండే విధంగా తాము పోరాటం చేస్తున్నామని.. ఇందులో భాగస్వాములు కావాలని జగన్ ను కోరినట్లుగా వివరించారు. డీఎస్సీ -2025 అక్రమాల పైన సీబీఐ విచారణ జరిగాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, హామీల విస్మరణ, ప్రజా సమస్యల పైన కలిసి పోరాటం చేద్దామని తాము చేసిన ప్రతిపాదనకు జగన్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఈశ్వరయ్య చెప్పుకొచ్చారు. అయితే, వైసీపీ ఏర్పాటు తరువాత ఇప్పటి వరకు ఏ అంశంలోనూ ఇతర పార్టీలతో కలిసి పోరాటా లు, ఎన్నికల పొత్తులు లేవు. ఇప్పుడు జగన్ సానుకూలంగా స్పందించారంటూ సీపీఐ నేతలు చెబుతుండటంతో.. రానున్న రోజుల్లో వైసీపీ- సీపీఐ మధ్య చోటు జరిగే చర్చలు.. నిర్ణయాల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications
