Manmohan Singh: మన్మోహన్ సింగ్ కడిగిన ముత్యం- తేల్చేసిన సుప్రీంకోర్టు..!
దేశానికి రెండుసార్లు ప్రధానిగా, ఆర్దికమంత్రిగా పనిచేసిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) కు బొగ్గు కుంభకోణం మరకలు అంటించేందుకు రాజకీయ ప్రత్యర్థులు చేసిన ప్రయత్నం ఎట్టకేలకు తేలిపోయింది. యూపీఏ హయాంలో చోటు చేసుకున్న బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్ పాత్ర ఉందంటూ గతంలో అభియోగాలు నమోదు చేసి సుదీర్ధ దర్యాప్తు చేసిన సీబీఐ ..ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించడంతో మన్మోహన్ చనిపోయిన ఏడాదిన్నర తర్వాత కడిగిన ముత్యంలా బయటపడినట్లయింది.
యూపీఏ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం విషయంలో అప్పటి ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ పై 2015లో ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ మన్మోహన్ సింగ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీలుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా బొగ్గు కుంభకోణం కేసులో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఉన్న కేసును మూసివేయాలని సీబీఐ సుప్రీంకోర్టును ఆభ్యర్ధించింది. ఈ అభ్యర్ధనను సుప్రీంకోర్టు ఆమోదిస్తూ మన్మోహన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.

గతంలో సీబీఐ కేసు క్లోజర్ నివేదికను తిరస్కరించడానికి ట్రయల్ కోర్టుకు ఎటువంటి బలమైన కారణాలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. కాబట్టి మన్మోహన్ సింగ్ పై సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ నివేదికను ఆమోదించింది. సీబీఐ సమర్పించిన ముగింపు నివేదికలను తిరస్కరించడానికి, కేసును విచారణకు స్వీకరించడానికి సెషన్స్ జడ్జికి ఎటువంటి బలమైన కారణాలు లేవని తాము సంతృప్తి చెందినట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కాబట్టి తాము సీబీఐ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను అనుమతిస్తూ.. ట్రయల్ కోర్టు జడ్జి వివాదాస్పద ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ నివేదికలను ఆమోదించి, కేసును యోగ్యతల ఆధారంగా ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.














Click it and Unblock the Notifications