ఏపీకి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు అదే తుది తీర్పు: మత మార్పిడితో ఎస్సీ హోదా దక్కదు
మత మార్పిడి చేసుకున్న వారికి సంక్రమించే షెడ్యూల్డ్ కులాల హోదాపై దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టత ఇచ్చింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు మినహా మరే మతంలోకి మారినా ఎస్సీ హోదా దక్కదని తేల్చి చెప్పింది. ఈ మూడు మతాలు మినహా క్రైస్తవంలో గానీ ఇతర వాటిల్లోకి మారిన వ్యక్తులు తమ ఎస్సీ హోదాను ఆటోమేటిక్ గా కోల్పోతారని పునరుద్ఘాటించింది. ఈ మేరకు గతంలో తాము ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌పై విచారణను తిరస్కరించింది.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చి 24వ తేదీన ఇచ్చిన ప్రధాన తుదితీర్పులో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేసింది. తాజాగా దాఖలైన ఈ రివ్యూ పిటీషన్ కు విచారణ అర్హత లేదని కొట్టివేసింది. కేసులో మౌఖిక వాదనలు వినాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో ఈ సుదీర్ఘ చట్టపరమైన వివాదానికి తుది ముగింపు లభించినట్టయింది.

సుప్రీంకోర్టు ఇదివరకు ఇచ్చిన తుది తీర్పు ప్రకారం.. ఒక వ్యక్తి క్రిస్టియానిటీని స్వీకరించిన తర్వాత సాంకేతికంగా తన ఎస్సీ సామాజిక హోదాను కోల్పోతాడు. తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లోకి మారితే కొన్ని నిబంధనలకు లోబడి ఆ హోదాను తిరిగి పొందే అవకాశం ఉంది. దీనికోసం ఆ వ్యక్తి తాను ప్రాథమికంగా నోటిఫైడ్ షెడ్యూల్డ్ కులానికి చెందిన కుటుంబంలోనే జన్మించినట్లు స్పష్టంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది.
దీంతో పాటు.. ప్రస్తుతం ఆచరిస్తున్న మతాన్ని పూర్తిగా వదిలిపెట్టి, హిందూ, సిక్కు, బౌద్ధ మతంలోకి ఎటువంటి ప్రలోభాలకు గానీ, బలవంతంగా గానీ మారినట్లు నిర్ధారించుకోవాలి. తన పూర్వ కుల సమాజానికి చెందిన పెద్దలు, సభ్యులు తిరిగి తమ మతంలోకి అతన్ని ఆహ్వానిస్తోన్నట్లు అంగీకరించాల్సి ఉంటుంది. ఈ మూడు షరతులలో ఏ ఒక్కటి నెరవేరకపోయినా ఎస్సీ హోదా పునరుద్ధరణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది.
ఇది ఏపీకి సంబంధించిన కేసు. చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధారంగా ఇది మొదలైంది. ఎస్సీ కులంలో జన్మించిన ఆనంద్ అనే వ్యక్తి క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. పాస్టర్‌గా మారారు. తనపై జరిగిన ఓ గొడవకు సంబంధించి కులం పేరుతో దూషించారంటూ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు.
క్రైస్తవంలో కుల వర్గీకరణలు లేనందున ఆనంద్ క్రైస్తవుడిగా మారడం వల్ల ఎస్సీ హోదాను కోల్పోయారని, కనుక ఈ చట్టం కింద కేసు చెల్లదని ఏపీ హైకోర్టు ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసింది. ఈ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వు, 1950 కింద క్లాజ్ 3 ప్రకారం ఎస్సీ హోదా హిందూ, సిక్కు, బౌద్ధ మతస్తులకు మాత్రమే పరిమితమనే విషయాన్ని కోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications