గిటార్ కు హెల్మెట్ లేదని.. రూ. 500 చలాన్.. బెంగళూరులో షాకింగ్ ఘటన
ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని పోలీసులు చెబుతుంటారు. హెల్మెట్ ధరించని వారికి ఫైన్ లు వేస్తుంటారు. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చొన్నవారు కూడా హెల్మెట్ ధరిస్తూ ఉన్న పలు కథనాలను మనం చూశాం. ఇక అలాంటి వారిని చూసినప్పుడు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా అభినందిస్తుంటారు. అయితే ఇటీవల కర్ణాటక బెలగావి జిల్లాలోని అథని టౌన్ లో కారులో పెట్టుకోలేదని ఓ వ్యక్తికి రూ. 500 ఫైన్ విధిస్తూ మెసేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. స్థానికంగా ఏర్పాటు చేసిన ఏఐ కెమెరా ఇందుకు సంబంధించిన ఫొటోను క్లిక్ చేసి సంబంధిత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు చలాన్ మెసేజ్ పంపించింది. అయితే ఈ ఘటన గురించి తెలిపేందుకు బాధితుడు హెల్మెట్ పెట్టుకుని కారు నడుపుకుంటూ పోలీస్ స్టేషన్ కు చేరుకుని తన నిరసన వ్యక్తం చేశాడు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అయితే అదే కర్ణాటకలోని బెంగళూరులో మరోసారి విచిత్రమైన ఘటన జరిగింది. ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని తన బైక్ పై వెళ్తుండగా ఆయన వెనకాల గిటార్ బ్యాగ్ ఉంది. అయితే గిటార్ కు హెల్మెట్ లేదని రూ.500 చలాన్ విధించారు. వివరాల్లోకి వెళ్తే.. సౌవిక్ దత్తా అనే వ్యక్తి తన భార్య బైక్ తీసుకొని.. హెల్మెట్ పెట్టుకొని, వీపుకు గిటార్ తగిలించుకొని రోడ్డుపైకి వెళ్లాడు. అయితే ఆ గిటార్ ను ప్రయాణికుడిగా భావించన ఏఐ ట్రాఫిక్ కెమెరా ఈ మేరకు హెల్మెట్ లేదని రూ.500 చలానా విధించింది. ఈ మేరకు అతని రిజిస్టర్డ్ మొబైల్ కు మెసేజ్ వచ్చింది. అయితే మెసేజ్ చూసి ఖంగుతిన్న సౌవిక్.. గిటార్ లకు కూడా హెల్మెట్ లేదని చలాన్లు వేస్తారా..? అంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ మేరకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల్ని ట్యాగ్ చేశారు. అలాగే ఈ పోస్టులో తనకు విధించిన చలాన్ ను రద్దు చేయాలని సౌవిక్ కోరారు. ఇక ఇది ఏఐ ఆధారిత కెమెరా తప్పు అని గ్రహించిన పోలీసులు ఆయన పోస్టుకు స్పందించారు. తమకు మెయిల్ చేయాలని, చలాన్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications
