బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో సాఫ్ట్ వేర్ లోపం.. భారత్ లో 96 విమానాలపై ప్రభావం
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ .. తన 737 మ్యాక్స్ విమానాలకు సంబంధించి సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ విమానాల్లో సాఫ్ట్ వేర్ లోపం కారణంగా ల్యాండింగ్ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించే సమయంలో ఆటోమేటెడ్ ఫ్లైట్ గైడెన్స్ సిస్టమ్ షట్ డౌన్ అయ్యే అవకాశం ఉన్నట్లు బోయింగ్ గుర్తించింది. ఈ సాఫ్ట్ వేర్ ప్రభావం భారత్ లో ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తదితర సంస్థలు నడుపుతున్న సుమారు 96 విమానాలపై పడనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమస్యపై 737 విమానాలను నడుపుతున్న అన్ని ఎయిర్ లైన్స్ కు గత నెలలోనే సమాచారం ఇచ్చినట్లు బోయింగ్ ప్రతినిధి వెల్లడించారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పైలట్లు ఆటోమేషన్ తగ్గిపోవడాన్ని గమనించవచ్చని.. ఈ సమస్యను పైలట్లు సురక్షితంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఉన్న విధానాలను మరోసారి వివరించినట్లు పేర్కొన్నారు. తాత్కాలిక నివారణ చర్యగా మిస్ డ్ అప్రోచ్ తర్వాత సిస్టమ్ ను రీసెట్ చేయాలని ఆపరేటర్లకు తెలిపినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సాఫ్ట్ వేర్ అప్ డేట్ ను బోయింగ్ రూపొందిస్తోందని అన్నారు. అప్పటివరకు ముందు జాగ్రత్త చర్యగా ల్యాండింగ్ విఫలమైన ప్రతిసారి సిస్టమ్ ను రీసెట్ చేయాలని ఆపరేటర్లకు ఇప్పటికే బోయింగ్ సూచించిన సంగతి తెలిసిందే.

ఇక భారత్ లో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ వద్ద సుమారు 53, ఆకాసా ఎయిర్ వద్ద 43 ఇలా మొత్తం 96 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ఉన్నాయి. ఈ సమస్యపై ఆకాసా ఎయిర్ స్పందిస్తూ.. బోయింగ్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. ఈ సమస్య తమ విమానాల భద్రతపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై మాత్రం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ స్పందించలేదు.అలాగే అటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కూడా ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు.












Click it and Unblock the Notifications
