ఉత్తరప్రదేశ్ లో వర్ష బీభత్సం.. 3 రోజుల్లోనే 58 మంది మృతి
ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నడూ లేని విధంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో భారీ వర్షాలు, వరద ప్రమాదం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 58 మంది మృతిచెందారు. మరో 46 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇక సీతాపుర్ జిల్లాలో అత్యధికంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరద పరిస్థితి దారుణంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 1000 కు పైగా ఇళ్లు ధ్వంసం కావడంతో వేలాదిమంది నిరాశ్రయులు అయ్యారు. మరోవైపు వర్షపు నీరు నిలవడంతో ఉన్నావ్ లోని సోనిక్ టోల్ ప్లాజా వద్ద గంగా ఎక్స్ ప్రెస్ వే ను అధికారులు నిలిపివేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
వర్షాల ధాటికి సీతాపూర్ జిల్లాలో అత్యధికంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా లఖిమ్ పూర్ ఖేరీ, బరైచ్ లో ఐదుగురు, బల్ రామ్ పూర్ లో ఐదుగురు అలాగే అయోధ్యలో నలుగురు, గోరఖ్ పూర్ లో నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఇప్పటివరకూ వర్షాల ధాటికి 1,021 ఇళ్లు ధ్వంసం అయినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 63 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. అలాగే గడిచిన 24 గంటల్లో 45.1 ఎంఎం అధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

సాధారణం అయిన 1.8 కంటే ఈ వర్షపాతం చాలా అధికం అని స్పష్టం చేశారు. అలాగే రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 20 కు పైగా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని స్పష్టం చేసింది. మరోవైపు నిత్యం బిజీగా ఉండే ఉన్నావ్ లోని సోనిక్ టోల్ ప్లాజా వద్ద గంగా ఎక్స్ ప్రెస్ వేపై భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో దాన్ని అధికారులు మూసివేశారు. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ప్రభుత్వ నిర్ణయంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ యూపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రహదారి పేరును 'గంగా ఎక్స్ ప్రెస్ వాటర్ వే' గా మార్చాలని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications
