పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ కు పదేళ్లు: ప్రధాని మోదీ తాజా హెచ్చరికలు
దేశ రక్షణలో నూతన అధ్యాయానికి తెరతీసిన ఘటన.. సర్జికల్ స్ట్రైక్స్. దీనికి ఈ నెల 28వ తేదీతో పదేళ్లు పూర్తి కానున్నాయి. ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 138వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో దీని గురించి ప్రస్తావించారు. దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడంలో సైన్యం కనబరుస్తున్న అసమాన ప్రతిభను కొనియాడారు. ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న కఠినమైన జీరో టాలరెన్స్ విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ నూ గుర్తు చేసుకున్నారు.
సరిహద్దుల అవతల నుంచి దేశంలోకి చొరబడాలని చూసే శత్రు మూకలకు నేటి భారత్ తగిన రీతిలో బుద్ధి చెబుతుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. 2016 సెప్టెంబర్ 28, 29 తేదీల్లో జవాన్లు అత్యంత సాహసోపేతంగా నియంత్రణ రేఖ దాటి పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించిన సంగతిని గుర్తుచేశారు. ఈ సర్జికల్ స్ట్రైక్స్ విజయవంతమైన విధానం అంతర్జాతీయ సమాజాన్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు.

దశాబ్దాలుగా తీవ్రవాద దాడుల వల్ల భారత్ అనుభవించిన మానసిక వేదన, ప్రాణ నష్టానికి ఈ మెరుపు దాడి అత్యంత నిర్ణయాత్మకమైన సమాధానంగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదని అభిప్రాయపడ్డారు. దేశ రక్షణ విధానంలో వచ్చిన స్పష్టమైన మార్పులను వివరించారీ సందర్భంగా. గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ వరకు సాగిన రక్షణ చర్యలు శత్రుదేశాలకు గట్టి హెచ్చరికలను పంపాయని చెప్పారు.
భారత్ పై ఎవరైనా కన్ను వేస్తే వారి ఇంటికి వెళ్లి తుదముట్టించే సత్తా ఇప్పుడు మన సైన్యానికి ఉందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇది..దేశ వ్యూహాత్మక విజయానికి నిదర్శనమని కితాబిచ్చారు. ఉగ్ర దాడుల పట్ల గత పాలకులు అనుసరించిన వైఖరిని తప్పుపట్టారు. ఒకప్పుడు దేశంలో వరుస బాంబు పేలుళ్లు సర్వసాధారణమైన విషయంగా ఉండేవని, 2008 సెప్టెంబర్ 13న ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో అనేకమంది అమాయకులు బలయ్యారని, ఆ తర్వాత కొద్ది వారాలకే ముంబైలో భీకరమైన 26/11 దాడులు జరిగాయని అన్నారు.
నాటి దాడుల తర్వాత పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చినప్పటికీ అప్పటి పాలకులు శ్రద్ధ చూపలేదని ప్రధాని మోదీ విమర్శించారు. తమ హయాంలో దేశ రక్షణ విధానం పూర్తిగా మారిపోయిందని స్పష్టం చేశారు. అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన 9/11 ఉగ్రవాద దాడి జరిగి ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తయిన విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. నాటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో అమెరికన్ల తర్వాత అత్యధిక సంఖ్యలో ఉన్నది భారతీయులేనని చెప్పారు.
ఈ సంవత్సరాన్ని సోమనాథ్ స్వాభిమాన్ పర్వాన్ని ప్రారంభించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. క్రీస్తు శకం 1026లో మహ్మద్ ఘజినీ మొదటిసారిగా సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేశాడని గుర్తు చేశారు. సోమనాథ్ ఆలయాన్ని నాశనం చేయడం ద్వారా దేశ అస్తిత్వాన్ని తుడిచివేయడానికి ప్రయత్నించిన వారి ఉనికే లేకుండా పోయిందని అన్నారు. ఆ ఆలయం ఇప్పటికీ చెక్కుచెదరలేదని, అమరత్వానికి, దేశ సాంస్కృతిక వైభవానికీ ప్రతీకగా నిలిచిందని చెప్పారు.
అదే సమయంలో గుజరాత్‌లోని ప్రసిద్ధ మోధేరా సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి కూల్చివేశారని, అయినప్పటికీ కింగ్ భీమ్‌దేవ్- 1 అతి తక్కువ కాలంలోనే దాన్ని పునర్నిర్మించారని మోదీ వివరించారు.














Click it and Unblock the Notifications
