HIV: ప్రతి 8 వారాలకోసారి ఈ ఇంజెక్షన్ తీసుకుంటే సరి!
ప్రతిరోజూ మందుల బిళ్లలు మింగలేక, నానా అవస్థలు పడుతున్న హెచ్‌ఐవీ బాధితులకు వైద్య పరిశోధన రంగం నుంచి ఒక గొప్ప ఊరట లభించింది. రోజూ వేసుకునే ట్యాబ్లెట్లతో పోలిస్తే.. ప్రతి ఎనిమిది వారాలకోసారి (రెండు నెలలకు ఒకసారి) తీసుకునే లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్ హెచ్‌ఐవీ వైరస్‌ను చాలా సమర్థవంతంగా అణచివేస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. యునివర్సిటీ కాలేజ్ లండన్ (UCL) పరిశోధకుల ఆధ్వర్యంలో ఆఫ్రికా దేశాల్లో నిర్వహించిన ఈ క్లినికల్ ట్రయల్స్ సంచలన ఫలితాలను ఇచ్చాయి.
ట్యాబ్లెట్ల కంటే ఇంజెక్షనే బెటర్.. తేల్చేసిన అధ్యయనం
ప్రముఖ మెడికల్ జర్నల్ 'ది లాన్సెట్'లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. టీనేజ్ వయసులో ఉన్న హెచ్‌ఐవీ బాధితులు రోజూ మందులు వేసుకోవడం కంటే, ప్రతి రెండు నెలలకోసారి ఇచ్చే ఇంజెక్షన్ ద్వారా తమ ఆరోగ్యాన్ని ఎంతో మెరుగ్గా నిర్వహించుకోగలుగుతున్నట్లు తేలింది. ఈ ట్రయల్స్‌లో భాగంగా సుమారు 476 మంది కౌమార దశలోని యువతీయువకులను పరిశీలించారు. వీరికి సాధారణ రోజువారీ ట్యాబ్లెట్లకు బదులుగా కేబోటెగ్రావిర్, రిల్పివిరిన్ అనే లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్లను అందించారు.

రికార్డు స్థాయిలో తగ్గిన వైరల్ రీబౌండ్ ముప్పు
ఈ పరిశోధనలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రెండు నెలలకోసారి ఇంజెక్షన్ తీసుకున్న వారిలో కేవలం 1 శాతం మందిలో మాత్రమే (ఇద్దరు వ్యక్తుల్లో) వైరస్ మళ్లీ పుంజుకోవడం (వైరల్ రీబౌండ్) జరిగింది. అదే ప్రతిరోజూ ట్యాబ్లెట్లు వేసుకున్న వారిలో మాత్రం ఈ శాతం 6 శాతంగా (15 మందిలో) నమోదైంది. దీన్ని బట్టి రోజూ మందులు మింగే పద్ధతి కంటే ఇంజెక్షన్ విధానమే వైరస్‌ను కట్టడి చేయడంలో చాలా శక్తివంతంగా పనిచేస్తోందని స్పష్టమైంది.
మానసిక ఒత్తిడి నుంచి టీనేజర్లకు విముక్తి
యువతలో చాలామంది ప్రతిరోజూ నలుగురిలో మందులు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల తోటి విద్యార్థుల నుంచి వేధింపులు, చిన్నచూపు వంటి సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతీ రెండు నెలలకోసారి తీసుకునే ఈ ఇంజెక్షన్ల వల్ల టీనేజర్లు ఎలాంటి భయం లేకుండా సాధారణ జీవితాన్ని గడపడానికి వీలవుతుందని లండన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఇంజెక్షన్ తీసుకున్న వారిలో ఏకంగా 94 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆఫ్రికా దేశాలకే అసలు సమస్య.. అందుబాటులోకి రాని వైనం
ప్రపంచంలో హెచ్‌ఐవీతో బాధపడుతున్న టీనేజర్లలో దాదాపు 90 శాతం మంది ఆఫ్రికా దేశాలవారే ఉన్నారు. అయితే, ఈ అత్యుత్తమ ఇంజెక్షన్ చికిత్స ఆ ప్రాంతంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు మాత్రం అసలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ మందుల తయారీ ఖరీదు ఎక్కువగా ఉండటం, పేటెంట్ నిబంధనలు అడ్డుగా మారడం, రిల్పివిరిన్ ఇంజెక్షన్లను నిల్వ చేయడానికి ప్రత్యేక శీతల గదులు (ఫ్రిడ్జ్ సౌకర్యం) అవసరం కావడం వంటి పలు సవాళ్లు ఎదురవుతున్నాయి.
ప్రభుత్వాలు, సంస్థలు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి
అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ దేశాలలో 12 ఏళ్లు పైబడిన వారికి ఈ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆఫ్రికాలో మాత్రం ఇవి ఇంకా కలగానే మిగిలిపోయాయి. భవిష్యత్తులో ఏడాదికి కేవలం రెండుసార్లు మాత్రమే వేసుకునే సరికొత్త ఇంజెక్షన్లు కూడా ప్రయోగా దశలో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, హెచ్‌ఐవీ బాధితుల ప్రాణాలను రక్షించే ఈ అత్యాధునిక ఇంజెక్షన్ వైద్యం కేవలం ధనికులకే కాకుండా, అవసరమైన అందరికీ తక్కువ ఖర్చుతో అందేలా ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు తక్షణ చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు గట్టిగా కోరుతున్నారు.














Click it and Unblock the Notifications
