శాసనసభ వర్షాకాల సమావేశాలు...తేదీలు ఖరారు:మొత్తం 8 రోజుల పాటు సెషన్స్
అమరావతి:ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ కోడెల ఇంతకుముందే లాంచనంగా నిర్ణయించినా ఇప్పుడు ఆ తేదీల ఖరారు జరిగింది.
సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 9 గంటల 45 నిమిషాలకు శాసనసభ వర్షకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 6 నుంచి 19వ తేదీ వరకూ సమావేశాలు కొనసాగుతాయి. ఇందులో సెలవులు మినహాయిస్తే మొత్తం 8 రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. 8,9,13,14,15,16 తేదీల్లో శాసనసభకు సెలవులుగా నిర్ణయించారు. దీనిపై వచ్చేనెల 6న జరిగే బీఏసీ సమావేశం తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది.

తొలుత ఈ సమావేశాలను పది రోజుల పాటు నిర్వహించాలని భావించినా ఆ తరువాత వాటిని 8 రోజులకు కుదించడం జరిగింది. ఈ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ వైసిపి హాజరుకావాలని ఆ పార్టీ అధినేత జగన్‌ను స్పీకర్ కోరే అవకాశం ఉందని తెలిసింది. అలాగే ఈ సమావేశాల్లో పలు కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
అసెంబ్లీ సమావేశాలను వైసిపి బాయ్ కాట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వైసిపి ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి సీనియర్ నేతలతో సహా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరవ్వాలని కోరుతున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం ఈవిషయంలో పట్టుబట్టే ఉన్నారని తెలుస్తోంది.
గతంలో అసెంబ్లీ సమావేశాల బాయ్ కాట్ సందర్భంగా తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేసేంత వరకూ అసెంబ్లీకి వెళ్లబోమని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు కూడా వైసీపీ హాజరవ్వకపోవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications