Nara Lokesh : నారా లోకేష్ కు సీఐడీ 41ఏ నోటీసులు-అక్టోబర్ 4న విచారణకు రమ్మంటూ..
ఏపీలో చర్చనీయాంశమవుతున్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో టీడీపీ నేత నారా లోకేష్ కు సీఐడీ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలు ఆధారాలు సేకరించిన సీఐడీ.. ఆయన్ను అరెస్టు చేసేందుకు సిద్ధమైంది అయితే నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఆయనకు ముందుగా 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో లోకేష్ కు ఇవాళ సీఐడీ 41ఏ నోటీసులు ఇచ్చింది.
హైకోర్టు ఆదేశాల మేరకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను అక్టోబర్ 4న విచారణకు రావాలని కోరుతూ సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలో స్వయంగా లోకేష్ ను కలిసి నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు నిన్న బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో లోకేష్ ను కలిసి నోటీసులు అందజేశారు. అలాగే వాట్సాప్ లోనూ ఈ నోటీసులు షేర్ చేసినట్లు తెలుస్తోంది. దీన్ని లోకేష్ కూడా నిర్ధారించారు. తనకు సీఐడీ నోటీసులు అందినట్లు వెల్లడించారు.

సీఐడీ నోటీసుల ప్రకారం మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో అక్టోబర్ 4 ఉదయం 10 గంటలకు లోకేష్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులో ఏ14గా ఉన్న లోకేష్ ను విచారించిన తర్వాత సీఐడీ తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ కేసులో అక్టోబర్ 4 వరకూ లోకేష్ ను అరెస్టు చేయకుండా సీఐడీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అక్టోబర్ 4న విచారణకు హాజరైనా లోకేష్ ను అరెస్టు చేయకపోవచ్చని తెలుస్తోంది.
నారా లోకేష్‌కు ఢిల్లీలో నోటీసులు అందించిన ఏపీ సీఐడీ అధికారులు.!#NaraLokesh #APCID #Delhi #AmaravatiScam #ChandrababuArrest #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/doMdk5dWmh
— oneindiatelugu (@oneindiatelugu) September 30, 2023
మరోవైపు సీఐడీ నోటీస్‌లపై నారా లోకేష్ ఇవాళ జరిగిన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో స్పందించారు. తాను ఢిల్లీలో హోటల్ మౌర్యలో ఉన్నానని వెల్లడించారు. ప్రతి రోజూ పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నానన్నారు. 50 అశోక రోడ్‌లో ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో కూడా ఉంటున్నానన్నారు. అప్పుడప్పుడు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కార్యాలయానికి వెళ్తున్నానని లోకేష్ వెల్లడించారు. తాను ఎక్కడికి పోలేదని, సీఐడీ వాళ్ళు ఎవరు తన దగ్గరకు రాలేదన్నారు. వాళ్ళు వస్తే నోటీస్లు తీసుకుంటానన్నారు. దాక్కునే అలవాటు తనకు లేదన్నారు. ఎవరో ఏదో ప్రచారం చేస్తే నాకేంటి సంబంధం అన్నారు.












Click it and Unblock the Notifications