ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ రద్దు ? జీతాలు పెంచితే ఏటా రూ.1848 కోట్లు..!
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు, జీతాల పెంపు విషయంలో కూటమి ప్రభుత్వం త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అసలు వాలంటీర్ల వ్యవస్థ విధివిధానాలు ఏంటి ?, వీరి పదవీకాలం ఎంత ? ఎన్నికల హామీ మేరకు వీరికి జీతాలు పెంచితే ఎంత అదనపు భారం ఖజానాపై పడుతుందన్న అంశాలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో పలు షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నట్లు తెలుస్తోంది.
వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం చేయిస్తున్న అధ్యయనంలో భాగంగా పలు కీలక విషయాలు వెలుగుచూసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్ద పదవీకాలం ముగిసినట్లు సమాచారం. గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ల వ్యవస్థ పదవీకాలం ముగిసినా జగన్ సర్కార్ అనధికారికంగా వీరిని ఈ ఏడాది మే నెల వరకూ కొనసాగించినట్లు తెలుస్తోంది. అంతే కాదు వీరి కొనసాగింపుపైనా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం రాజీనామాలు చేసిన వారిని మినహాయిస్తే లక్షన్నర వరకూ వాలంటీర్లు ఈ వ్యవస్ధలో ఉన్నారు.

మరోవైపు కూటమి ఎన్నికల హామీ మేరకు ప్రస్తుతం ఉన్న వాలంటీర్లకు జీతాల్ని 5 వేల నుంచి 10 వేలకు పెంచాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఏటా రూ.1848 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వీరితో పెన్షన్ల పంపిణీ సహా ఇతర సంక్షేమ పథకాలు కొనసాగిస్తారని భావించినా అలా జరగలేదు.దీంతో ప్రస్తుతం వాలంటీర్లకు ఎలాంటి విధులు లేవు. అయినా ఊరికే కూర్చోపెట్టి జీతాలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో వీరికి ఏదో పని అప్పగించి జీతాలు పెంచేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. త్వరలో దీనిపై అధికారిక నిర్ణయం వెలువడనుంది.












Click it and Unblock the Notifications