జగన్ సర్కార్ అనాలోచిత చర్య: మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ: పదిరోజులే టైమ్: ఈలోగా..!
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాలు, ఆదేశాలకు హైకోర్టుల బ్రేకులు పడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ జగన్ నిర్ణయాలను తీసుకుంటున్నారని, ఆదేశాలను జారీ చేస్తున్నారనే తెలుగుదేశం పార్టీ విమర్శలకు మరింత బలాన్ని ఇస్తున్నట్టవుతోంది. తాజాగా మరోసారి టీడీపీకి అలాంటి అవకాశాన్ని కల్పించినట్టయింది.

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులపై..
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి రద్దు బిల్లులపై హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ కొనసాగుతోంది. తాజాగా- ప్రభుత్వ కార్యాలాయాలకు పార్టీ జెండా రంగులు పులమడంపై దాఖలైన పిటీషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది. వెంటనే- ఆయా రంగులన్నింటిని తొలగించాలని ఆదేశించింది. వెంటనే అమలు చేయాల్సి ఉంటుందని, 10 రోజుల్లోగా కొత్త రంగులను వేయాల్సి ఉంటుందని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బాధ్యతలు..
దీనికి సంబంధించిన పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యతను హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి అప్పగించింది. కొత్త రంగులను నిర్ధారించాల్సిన బాధ్యత కూడా ఆమె మీదే పెట్టింది. కొత్త రంగులు ఎలా ఉండాలనే విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్ధారిస్తారని, ఆమె సూచించిన రంగులను ప్రభుత్వ కార్యాలయాలకు వేయాలని సూచించింది. తమ ఆదేశాలను అమలు చేసినట్లుగా నిరూపిస్తూ, ఫొటోలతో సహా ప్రత్యేకంగా ఓ నివేదికను అందజేయాలని హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు.

గ్రామస్థాయి కార్యాలయాలకు వైసీపీ రంగులు...
గ్రామస్థాయిలో పంచాయతీ రాజ్ కార్యాలయాలు, గ్రామ సచివాలయాలకు వైఎస్ఆర్సీపీ జెండాలోని రంగులను పులిమిన విషయం తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా కార్యకలాపాలను కొనసాగించాల్సిన ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులను వేయడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా పర్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు గత ఏడాది డిసెంబర్‌లో హైకోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు. వైసీపీ రంగులతో నింపేసిన గ్రామ సచివాలయాలు, పంచాయతీ రాజ్ కార్యాలయాల భవనాల ఫొటోలను ఆయన తన పిటీషన్‌కు జత చేశారు.
Recommended Video


గుంటూరు జిల్లా కలెక్టర్‌కు నోటీసులు..
ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. గుంటూరు జిల్లా కలెక్టర్‌కు నోటీసులను జారీ చేసింది. సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించింది. కొద్దిరోజుల కిందటే గుంటూరు జిల్లా కలెక్టర్ కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ప్రభుత్వ వాదనను వినిపించారు. ప్రభుత్వం ఇచ్చిన వివరణతో హైకోర్టు సంతృప్తి చెందలేదు. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలని, పది రోజుల్లోగా వాటి స్థానంలో కొత్త రంగులను వేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications