చంద్రబాబు, బోండా ఉమకు మహిళా కమిషన్ సమన్లు-వాసిరెడ్డి పద్మకు అవమానంపై 27న విచారణ
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. తాజాగా విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో వైసీపీ, టీడీపీ మధ్య వార్ మరోసారి ముదిరింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమకు మహిళా కమిషన్ సమన్లు పంపింది.
టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ రాష్ట్ర నేత బొండా ఉమకు రాష్ర్ట మహిళా కమిషన్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో జరిగిన ఘటనలపై ఈ సమన్లు పంపింది. ఆస్పత్రిలో బాధితురాలి పరామర్శకు వచ్చిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను అగౌరవపరచడం, బాధితురాలి ఆవేదన విననీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం, అత్యాచార బాధితురాలిని భయకంపితం చేసిన సంఘటనలపై విచారణకు హాజరు కావాలని చంద్రబాబు, బొండా ఉమ కు నోటీసులు పంపారు.

వీరిద్దరూ ఈ నెల 27న వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈనెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమ స్వయంగా విచారణకు రావాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సమన్లలో ఆదేశించారు.
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్యాంగ్ రేప్ బాధితురాలిని పరామర్శించేందుకు రాజకీయ పార్టీలు క్యూ కట్టాయి. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు అక్కడికి వచ్చారు. అదే సమయంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా వచ్చారు. ఆమె రాకను గమనించిన టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్యాంగ్ రేప్ కు ప్రభుత్వం బాధ్యత వహించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని చంద్రబాబు సహా నేతలు కోరారు. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ పంపిన నోటీసులకు చంద్రబాబు, బోండా ఉమ ఎలా స్పందించారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications