కెసిఆర్ హిట్ లిస్ట్: అసెంబ్లీ కూడా, ఎన్టీఆర్ స్టేడియం హుష్‌కాకి
హైదరాబాద్: సచివాలయాన్ని తరలించడానికి నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హిట్ లిస్టులో మరిన్ని చేరినట్లు తెలుస్తోంది. అసెంబ్లీని కూడా తరలించాలని ఆయన అనుకుంటున్నట్లు తాజాగా వార్తలు వచ్చాయి. శాసనసభ, శాసనస మండలికి కొత్త భవన సముదాయం నిర్మించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల కొంతమంది అత్యున్నత స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. సచివాలయాన్ని ఛాతీ ఆస్పత్రికి తరలించాలన్న అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ ఈ భేటీలోనే వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అసెంబ్లీ సమావేశాల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం, సభ్యుల వాహనాలకు సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం, అసెంబ్లీలో సభ్యులు కూర్చునే సీట్లు సౌకర్యవంతంగా లేకపోవడం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. సభ్యులు ఎక్కువ సేపు కూర్చొనేందుకుగానీ, నిలుచుని మాట్లాడేందుకుగానీ సౌకర్యంగా లేదని కూడా ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రాంగణం కొత్తగా నిర్మించినదే. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనానికి వందేళ్ల చరిత్ర ఉంది. ఇటీవలి దాకా ఉమ్మడి రాష్ట్ర సమావేశాలు జరిగిన సభనే తెలంగాణకు కేటాయించారు. ఇందులో 295 మంది సభ్యులు కూర్చోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో సమావేశాల సమయంలో సభ్యులందరూ హాజరైనా సభ చాలా వరకు ఖాళీగా కనిపిస్తోంది. దీంతో సీటింగ్ ఏర్పాట్లు చక్కదిద్దాలని అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాంకు సీఎం కేసీఆర్ సూచించారు. ఇప్పటిదాకా ఆ మార్పులేవీ జరగలేదు. ఇటీవల కేసీఆర్ సచివాలయంతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండాలనే విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు.
రాజధాని ఇందిరా పార్కు సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియం ఇక కనుమరుగు కానుంది. ఈ ప్రాంతంలో అత్యాధునికమైన, అంతర్జాతీయ స్థాయి తెలంగాణ కళా భారతి ఏర్పాటు కానుంది. ఇందులోనే కన్వెన్షన్ సెంటర్లు కూడా ఉంటాయి. అలాగే... రవీంద్ర భారతికి సైతం కొత్త రూపు ఇవ్వనున్నారు. ప్రముఖ ఆర్కిటెక్ హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన డిజైన్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు.












Click it and Unblock the Notifications