ప్రియురాలి కోసం ఏటీఎం దొంగగా మారిన యువకుడు
వరుస ఎటిఎం దొంగతనాలకు పాల్పడుతున్న వేల్పుల రాజేష్ అనే హైదరాబాద్ యువకుడిని గుంటూరు లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు.
అమరావతి: ప్రేమికులకు హెచ్చరిక. మీ ప్రియుడు లేక ప్రియురాలు మీకు తరుచు ఖరీదైన గిఫ్టులు ఇస్తూ మిమ్మల్ని ఆనందపెట్టాలని చూస్తున్నారా? సరైన ఆదాయమే లేకుండా వారు ఇంతింత ఖరీదైన బహుమతులు ఎక్కడ నుంచి తెస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నఅడుగుతుంది మేము కాదండి గుంటూరు పోలీసులు. లవర్ ను సంతోష పెట్టేందుకు దొంగలు మారుతున్న యువతీ యువకులు ఎక్కువవుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ ప్రశ్న సంధిస్తున్నారు.
ఇంకా విద్యార్ధి దశలోనే ఉండటమో, లేక సాధారణ ఉద్యోగం మాత్రమే చేస్తూ ఖరీదైన గిఫ్టులు బహుమతిగా ఇస్తున్న మీ లవర్ ఆ బహుమతులు ఎక్కడ నుంచి ఎలా తెస్తున్నాడో ఒక్కసారి ఆలోచించమంటున్నారు పోలీసులు. పోలీసులు ఇలా ఎందుకు అడగాల్సివచ్చిందంటే...ప్రియురాలితో కలసి షికార్లు చేసేందుకు, ఆమెకు ఖరీదైన బహుమతులు ఇచ్చి సంతోష పెట్టేందుకే దొంగగా మారానంటున్నాడు ఓ యువకుడు. కానీ చివరకు పోలీసులకు పట్టుబడి జైలు పాలయ్యాడు.

ప్రియురాలిని సంతోష పెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనుకున్న ఆ యువకుడు ఆ డబ్బు సంపాదించడానికి అతడు ఎంచుకున్న మార్గం ఎటిఎంల వద్ద చోరీ. అక్కడకు వచ్చే అమాయక ఖాతాదారులను మాయమాటలతో బురిడీ కొట్టించి మనీ లాగేయడం. ఈ విధంగా వరుస ఎటిఎం దొంగతనాలకు పాల్పడుతున్న వేల్పుల రాజేష్ అనే హైదరాబాద్ యువకుడిని గుంటూరు లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ కండే శ్రీనివాసులు, ఎస్‌హెచ్‌వో మురళీకృష్ణ ఈ ఎటిఎం దొంగ వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వేల్పుల రాజేష్ హైదరాబాద్ లోనే ఓ యువతిని ప్రేమించాడు. ఎలాగోలా ఆమెని కూడా ప్రేమ ముగ్గులోకి దించాడు. ఈ నేపథ్యంలోనే ఆమెకు గుంటూరులోని నర్సింగ్ కళాశాలలో సీటు రావడంతో ఇక్కడకు వచ్చింది. ప్రియురాలితో పాటే తాను అనుకున్నాడో ఏమో రాజేష్ కూడా గుంటూరుకే మకాం మార్చేశాడు. గుంటూరులోని మంగళదాస్ నగర్‌లో ఓ గది అద్దెకు తీసుకొని ఉంటూ ప్రేమాయణం కొనసాగించాడు.

అయితే ఇందుకు బాగా ఖర్చవుతుండటంతో అసలు ఈ ఖర్చులకే కాదు మరింత డబ్బు ఉంటే ప్రియురాలితో ఇంకా చేయొచ్చుకదా అనుకున్నాడు. అంతే ఈజీమనీ కోసం బాగా ఆలోచించి ఎటిఎం దొంగతనాలైతే తనకి బాగా సూట్ అవుతాయనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగిన రాజేష్ అక్టోబర్ నెలలో ఎటిఎం దొంగగా కెరీర్ ప్రారంభించాడు. గుంటూరు ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న ఏటీఎం సెంటర్‌లో డబ్బులు డ్రా చేసేందుకు ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తిని గుర్తించి మాయమాటలు చెప్పి అతని కార్డు కాజేశాడు.
ఆ తర్వాత అతని ఖాతా నుంచి రూ.8 వేలు డ్రా చేశాడు. మొదటి చోరీ విజయవంతం అవడంతో కాన్ఫిడెన్స్ పెరిగి ఇక వరుస దొంగతనాలకు తెగబడ్డాడు. అక్టోబర్ 10వ తేదీ ఆర్టీసీ బస్టాండ్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమె కార్డుతో రూ. 64 వేలు డ్రా చేశాడు. నవంబర్ 4వ తేదీన చందన బ్రదర్స్ పక్కన ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో ఓ వృద్ధుడికి డబ్బులు డ్రా చేసేందుకు సహాయపడినట్లుగా నటించి ఆ వృద్ధుడి ఖాతా నుంచి రూ. 72 వేలు లాగేశాడు. అయితే ఎటిఎం ల వద్ద వరుస దొంగతనాలు నమోదవుతుండటంతో వీటిపై సీరియస్ గా దృష్టి సారించిన పోలీసులు ఇవన్నీ ఒక్కడి పనే అనే తెలుసుకున్నారు.
ఆ తరువాత సిసి కెమేరాల ఫుటేజ్ ఆధారంగా వేల్పుల రాజేష్‌ను అరెస్టు చేశారు. చోరీ చేసిన రూ. 1.36 లక్షలతో అతడు 23 గ్రాముల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. వాటిని ప్రియురాలికి ఇచ్చానని రాజేష్ అంటున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి బంగారు ఆభరణాలతో పాటు రూ. 40 వేల నగదు, 7 నకిలీ ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లవర్ ఖరీదైన బహుమతులు ఇస్తున్నాడని సంబరపడే యువతీ యువకులు అతడు ఆ బహుమతులు ఎలా తెచ్చి ఇస్తున్నాడో తెలుసుకోకపోతే చిక్కుల్లో పడతారని హెచ్చరిస్తున్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications